
‘పెన్షన్’ అనేది సామాజిక భద్రతా పథకం. శ్రమనే పెట్టుబడిగా పెట్టి జీతంతో కడుపు నింపుకునే ఉద్యోగులు వయసుపై పడటంవల్ల ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పేదరికంలోనికి వెళ్ళిపోకుండా కాపాడేది. మన దేశం శ్రేయో రాజ్యం. ఈ శ్రేయో రాజ్యంలో ప్రజల శ్రేయస్సును కాపాడే బాధ్యత ప్రభుత్వాలది. దేశంలోని పాత పెన్షన్ దారులకు హాని చేసే విధంగా పెన్షన్ ధృవీకరణ చట్టాన్ని 25 మార్చి, -2025 నాడు 2025- 2026 ఆర్థిక బిల్లులో భాగంగా గుట్టుచప్పుడు కాకుండా పార్లమెంటు ఆమోదించింది. పెన్షనర్లను పాత, కొత్త పెన్షనర్లుగా విడదీయడం ఈ బిల్లులోని ముఖ్య విషయం. ఈ చట్టంలోని సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వ పౌరసేవల (సివిల్ సర్వీసెస్) పెన్షన్ నిబంధనలు 1972, 2021, అసాధారణ పెన్షన్ నిబంధనలు 2023లో మార్పులు వస్తాయి. కొత్త సవరణలద్వారా వేతన సవరణల ఫలితంగా వచ్చే లాభాలను వేతన సవరణ కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులకే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు పే కమిషన్ సిఫార్సు చేసిన లాభాలు వర్తించవు. పే కమిషన్ సిఫార్సులను ఎప్పుడూ, ఎలా అమలు చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీని ద్వారా పెన్షన్ హక్కులు ఎవరికి వర్తించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఎనిమిదో వేతన సవరణ సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుండి అమలు చేయవలసి ఉంది. ఇప్పుడు ఈ చట్టం ద్వారా పెన్షనర్లు రెండు గ్రూపులు అవుతారు. అంటే 01- జనవరి, 2026 ముందు పదవీ విరమణ చేసినవారు, తర్వాత పదవి విరమణ చేసినవారు. అట్లే ఈ చట్టం ద్వారా వేతన కమిషన్ అమలు చేసిన తేదీ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ప్రకారం పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే ఆర్థిక లాభం చేకూరుతుంది.మిగిలిన వారికి ఆర్థిక లబ్ధి ఉండదు. వారికి ప్రస్తుతం పొందుతున్న పెన్షన్ మాత్రమే వస్తుంది. అట్లే ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ 01 మార్చి, 2025 తేదీన పదవీ విరమణ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘ సిఫార్సులు 01 జనవరి 2026 నుంచి అమలు చేస్తే, ముందు పదవీ విరమణ చేసిన వారు ఎవరికి ఈ చట్టం ప్రకారం ఆర్థిక లబ్ధి రాదు. అంటే 1 జనవరి, 26 తదుపరి పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వేతన సంఘం సిఫార్సుల లబ్ధి వర్తిస్తుంది.
సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఉటంకిస్తూ పెన్షన్ చెల్లింపు అనేది డిఫర్డ్ వేజ్‌గా గుర్తిస్తున్నామని, అందుకే పెన్షన్ చెల్లింపు ఉందని పేర్కొంటూనే, 1950, 1960, 1970లలో పని చేసిన ఉద్యోగికి 1986 లో పెన్షన్ చెల్లించాల్సిన అవసరం ఏమిటని, ఉద్యోగి పనిచేసిన కాలపు డిఫర్డ్ వేజ్‌ను పెన్షన్‌గా ఇప్పటికే ఆ పెన్షనర్ కు చెల్లిస్తున్నాం. కనుక పెన్షన్ పెంపుదల అవసరం లేదని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరు చేయడం అసమంజసమని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును నిర్వీర్యం చేస్తూ పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా నిర్ణయించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తోంది. ప్రభుత్వం పెన్షన్ పెరుగుదల అంశాన్ని మరింత విశదీకరిస్తూ మూడో వేతన సంఘం నుండి ఇప్పటి ఏడవ వేతన సంఘం దాకా పెన్షన్ పెరుగుదలపై విస్తృత చర్చ జరగాలని అన్ని వేతన సంఘాలు చెప్పాయని, కనుక ఇకపై వేతన సంఘం ఏర్పాటు తర్వాత ఆయా సిఫార్సులను అమలు చేయాల్సిన తేదీ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికు మాత్రమే వేతన సంఘం సిఫార్సులు వర్తిస్తాయని అంతకు ముందు రిటైర్ అయిన వారికి కాదని పేర్కొన్నారు. ఫైనాన్స్ బిల్లుపై సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండడం, న్యాయ పరిధిలో చాలెంజ్‌కు నిలబడే అవకాశాలు తక్కువ ఉండడం ఈ సందర్భంగా గమనించాలి.
1977 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వారికి చాలా తక్కువగా వచ్చే పెన్షన్లలో వివిధ కారణాల పేరుతో కోతలు విధించేవారు. 1979 లో కేంద్ర ప్రభుత్వం లిబరలైజ్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించి 1979 నాటికి సర్వీస్‌లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వులు ఇచ్చారు. ఇది 1979కి ముందు రిటైరైన వారికి శాపంగా మారింది. ఆనాడు అత్యధికంగా రూ. 675 మాత్రమే పెన్షన్ ఉండేది. ఆ పెన్షన్‌తో కుటుంబ జీవనం గడపడం కష్టతరమయ్యేది. కేంద్ర ప్రభుత్వ సరళీకృత పింఛన్ విధానం ద్వారా లభించే ఆర్థిక, ఇతర సౌలభ్యాలు 1979 మార్చి 31 నాటికి సర్వీసులో వున్నవారికి వర్తిస్తాయని, అంతకు పూర్వం పదవీ విరమణ చేసినవారికి వర్తించవని 1979 మే 25న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి పెన్షన్‌దారులను కుంగదీసాయి. అరకొర పెన్షన్‌తో జీవించడం కన్నా మరణమే మేలు అనే మానసిక భావనకు పెన్షన్‌దారులు గురయ్యారు. స్వయంగా బాధితుడైన నకారా, మరికొంతమంది పెన్షన్ బాధితులతో కలసి సుప్రీంకోర్టులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.వి చంద్రచూడ్ తోపాటు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, వాటి పూర్వాపరాలను పరిశీలించి 1982 డిసెంబర్ 17న చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించినది. అందులో- ‘పింఛను అనేది యజమాని ఇష్టాయిష్టాలతో, దయతో ఇచ్చే దానం కాదు. అది పింఛనుదారుని హక్కు; గతంలో ఉద్యోగిగా అతడు చేసిన సేవలను గుర్తించి చెల్లించేదే పింఛన్; ఉద్యోగి పదవీ విరమణ అనంతరం వృద్ధాప్య జీవితం సుఖసంతోషాలతో, గౌరవంతో సమాజంలో జీవించేందుకు చెల్లించేదిగా పింఛన్‌ను పరిగణించాలి; పింఛన్‌దారుడు స్వశక్తిపై ఆధారపడి జీవించడానికి కల్పించబడిన ఆర్థిక, న్యాయపరంగా ప్రభుత్వం తీసుకోవలసిన చర్య పింఛన్; కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఒక తేదీని ఎంచుకొని దానికి ముందు గాని, తరువాత గాని రిటైర్ అయిన వారిని విభజించి చూడటాన్ని భారత రాజ్యాంగ ఆర్టికల్ 14కి విరుద్ధం. నిర్ణీత తేదీకి ముందు రిటైర్ అయిన వారికి కూడా, ఆ తేదీ తరువాత రిటైర్ అయిన వారితో సమానంగా పెన్షన్ సవరణ లాభాలు ఇవ్వాలి; పెన్షనర్స్ అందరినీ ఒక తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో పెన్షనరీ ప్రయోజనాలు వర్తింపజేయాలి. పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు’ అనే ముఖ్యాంశాలున్నాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు జీతాల సవరణ జరిగినట్టుగా సామాజిక భద్రతగా చెల్లిస్తున్న పెన్షన్లకు కూడా వేతన సవరణల సందర్భంగా ఇచ్చే లాభాలను వర్తింప చేయడంతో వృద్ధాప్యంలో పెన్షనర్లు ప్రశాంత జీవనం గడపగలుగుతారు. వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెన్షన్లలో పెరుగుదల సహాయంగా ఉంటుంది. ఇక నుండి వృద్ధులైన పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
కేంద్రం తెచ్చిన పెన్షన్ ధృవీకరణ చట్టం రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరి మెడకు చుట్టుకుంటుంది. వాలిడేషన్ ఆఫ్ సిసిఎస్ (పెన్షన్) నిబంధనల చట్టం- 2025ని రద్దు చేయడంతోపాటు, ఎనిమిదో వేతన సవరణ కమిషన్ నిబంధనలను సవరించాలి. ఎన్‌పిఎస్/యుపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఒపిఎస్ విధానాన్ని అమలు చేయాలి. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ కాలాన్ని 11 ఏండ్ల మూడు నెలలకు తగ్గించాలి. 2017 జనవరి ఒకటి నుంచి జరగాల్సిన బిఎస్‌ఎన్‌ఎల్ , ఎంటిఎన్‌ఎల్ పెన్షనర్ల పెన్షన్ సవరణను వెంటనే చేపట్టాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసుల ప్రకారం పెన్షన్‌ను వెంటనే మంజూరు చేయాలి. ఇపిఎస్- 95 పెన్షనర్లకు కరువు భత్యంతో కూడిన కనీస పెన్షన్ నెలకు రూ. తొమ్మిది వేలు చెల్లించాలి. కోల్ మైన్ పెన్షనర్లకు కరువు భత్యంతో కూడిన కనీస పెన్షన్ నెలకు రూ. 15 వేలు చెల్లించాలి. పెన్షన్లకు కోతలు పెట్టే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెన్షనర్లతోపాటు,అఖిలభారత స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు సంఘటితమై దేశవ్యాప్తంగా సుదీర్ఘ సమరాన్ని సాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్, న్యూఢిల్లీ వారి పిలుపుమేరకు పెన్షన్‌కు కోతలు పెట్టే పెన్షన్ ధృవీకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మార్చి 25, 2026 నాడు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ఆందోళనకు పిలుపు నిచ్చింది. గత సంవత్సరం మార్చి 25 నాడు ఈ చట్టం ఆమోదం పొందిన నాడు నిరసన ప్రదర్శన నిర్వహించి, జిల్లా కలెక్టర్ల ద్వారా భారత ప్రధానికి వినతి పత్రాన్ని అందజేస్తున్నారు.