Reading Time: < 1 minute
Rr Vs Csk Ipl 2026 Vaibhav Sooryavanshi 15 Ball Fifty Post Match Reaction

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో మూడవ మ్యాచ్ సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్‌కే కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. 128 లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన రాజస్థాన్ 12.1 ఓవర్‌లోనే లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ తరఫున వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి, కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అయితే.. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజంటేషన్ వేడుకలో తన సంచలన బ్యాటింగ్ వెనుక ఉన్న రహస్యాలను, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని వైభవ్ వెల్లడించాడు. కోచ్ కుమార్ సంగక్కరతో పాటు సీనియర్ ఆటగాళ్లందరూ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపాడు. తన సహజసిద్ధమైన ఆటనే ఆడమని ప్రోత్సహించారన్నాడు. ఓపెనింగ్ పార్టనర్ యశస్వి జైస్వాల్ ప్రతి బాల్‌కి మధ్య తనతో మాట్లాడుతుంటారని వెల్లడించాడు. ఎప్పుడు సింగిల్స్ తీయాలి, ఎప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయాలి అనేది చెప్తూ నన్ను ఎంకరేజ్ చేశాడన్నాడు. చిన్న లక్ష్య ఛేదనలో పవర్‌ప్లేలో ఆధిపత్యం చెలాయించడమే తన ప్లాన్ అని చెప్పుకొచ్చాడు.

READ MORE: MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

అంతే కాదు మరిన్ని ఆసక్తికర విషయాలను సైతం వైభవ్ పంచుకున్నాడు. “మార్చి 27న నా పుట్టిన రోజు. జట్టులోని సభ్యులంతా కలిసి పుట్టిన రోజు వేడుకలకు ప్లాన్ చేశారు. ముఖానికి కేక్ పూస్తారేమో అని భయమేసింది. అందుకే నేను ముందుగానే నిద్రపోయాను. బయట కేక్ కటింగ్ హడావిడి జరుగుతోంది. కేక్ స్మెరింగ్‌ ఇష్టం లేక నేను త్వరగా పడుకున్నాను.” అంటూ అమాయకంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు.. ఈ యువ ప్లేయర్‌పై రియాన్ పరాగ్ స్పందించాడు. వైభవ్ ఆట తీరును ఎంతగానో మెచ్చుకున్నాడు. నెట్‌లో వైభవ్ బ్యాటింగ్ చూసి తాము ఫిదా అయ్యేవాళ్లమని పరాగ్ తెలిపాడు. బయట మీడియాలో ఏం జరుగుతుందో పట్టించుకోవద్దని, అన్ని మ్యాచ్‌ల్లోనూ నీ శైలిలోనే ఆడమని అతనికి చెప్పినట్లు తెలిపాడు. అతన్ని తన ఇష్ట ప్రకారం ఆడనివ్వాలని కోచ్‌లకు సైతం సూచన చేసినట్లు తెలిపాడు.