
మన తెలంగాణ/హైదరాబాద్‌ః కల్తీ మాఫియా ఆట కట్టించేందుకు ఈగల్, హైడ్రా తరహాలో కొత్త వ్యవస్థ తీసుకుని వస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఆహార కల్తీపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ నిరోధానికి దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడాతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు.
కల్తీ తిను బండారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనేక మంది కల్తీ ఆహారం తీసుకుని ఆసుపత్రి పాలవుతున్నారని, ఇంకా క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. కాబట్టి ఇకమీదట కల్తీ వ్యాపారుల ఆట కట్టిస్తానని ఆయన హెచ్చరించారు.
రేషన్ షాపుల ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేకపోవడంతో ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడడం లేదన్న ఆలోచనలు చేసిన తర్వాత పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని గత ఏడాది ఉగాది రోజున ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇందు కోసమే క్వింటాలుకు రూ. 500 రూపాయల బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహించామని ఆయన వివరించారు. అడిగిన వారందరికీ రేషన్ కార్డు జారీ చేశామని చెప్పారు.
రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. వాణిజ్య ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎక్కడైనా ఉత్పత్తిదారుడే తమ వస్తువు ధరను నిర్ణయిస్తారు కానీ ఒక రైతు పండించిన పంటకు మాత్రం ఆ అవకాశం లేదన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకు దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీస మద్దతు ధర చట్టం తెచ్చిందని ఆయన గుర్తు చేశారు. నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువ అని ఆయన తెలిపారు.
ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వాళ్ళను నియంత్రించడానికి ఆనాడు కాంగ్రెస్ పకడ్బందీగా పిడి యాక్ట్ (చట్టం) తీసుకొచ్చిందన్నారు. కాకపోతే అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదని ఆయన చెప్పారు. కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలుత పేదలకు రేషన్ కార్డులున్న వారికి కిలో రూపాయి తొంబై పైసలకు ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఎన్టీరామారావు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంగా మార్చి ముందుకు తీసుకెళ్లారని ఆయన వివరించారు. రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. నలభై ఏళ్లుగా ఇదే పథకం కొనసాగుతోందని, ఆనాటి నుంచి దొడ్డు బియ్యమే ఇస్తూ వచ్చారని ఆయన తెలిపారు. దొడ్డు బియ్యం తినేవారు లేరని గ్రహించి, పేదలకు తినగలిగే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి సన్నబియ్యం పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.
ప్రధాని ఫొటో పెడతాం..
సన్న బియ్యం పథకానికి తమకు ఏటా రూ. 14,500 కోట్ల రూపాయల వ్యయం అవుతున్నదని ఆయన తెలిపారు. ఈ వ్యయాన్ని కేంద్రం మోస్తే పథకంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెడతామని ఆయన చెప్పారు. ఈ పథకం బాగుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని తాను ఇదివరకే కేంద్రాన్ని కోరానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్
సన్న బియ్యం పండించాలని రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. 3 కోట్ల 39 లక్షలు అంటే 86 శాతం తెలంగాణ ప్రజలు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఇది 90 శాతం కూడా కావచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
విద్యార్థులకు పౌష్టికాహారం
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం తమ లక్షమని ఆయన తెలిపారు. అందుకే వరి ఒక్కటే కాదు వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందని, ఇందులో మీడియా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. పంట మార్పిడి విషయంలో రైతులపై వత్తిడి చేయం, అవగాహన కల్పిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.