
- ఇంట్రాడేలో 95.22 వరకు పతనం
- ఆర్‌బీఐ మద్ధతుతో కొంత స్టెబిలిటీ
- యుద్ధం వలన ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలే కారణం
- 1,635 పాయింట్లు పడిన సెన్సెక్స్
- గత రెండు సెషన్లలో రూ.18 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
డాలర్‌తో రూపాయి విలువ సోమవారం మొదటిసారిగా 95 లెవెల్‌ను దాటింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతున్నది. ఒక దశలో 95.22 వద్ద జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్1,635 పాయింట్లు పడింది. ఒక్క సోమవారమే ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లు తగ్గింది.
ముంబై: డాలర్‌తో రూపాయి పతనం ఆగడం లేదు. సోమవారం మొదటిసారిగా 95 లెవెల్‌ను దాటింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 115 డాలర్లకు చేరడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగకపోవడంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్‌లో రూపాయి సోమవారం 93.62 వద్ద ప్రారంభమై, 93.57 వరకు బలపడింది.
అయినప్పటికీ ఈ లెవెల్‌ను నిలబెట్టుకోలేక మొదటిసారిగా 95 స్థాయిని దాటి 95.22 వద్ద జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 94.70 వద్ద స్థిరపడింది. గత ముగింపుతో పోలిస్తే 15 పైసలు బలపడింది. వోలటాలిటీ ఎక్కువగా ఉండడంతో ఇంట్రాడేలో 165 పైసలు కదిలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు రూపాయి విలువ 4.1 శాతంగా తగ్గగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 శాతం విలువ కోల్పోయింది.
రూపాయి అమ్మకాలపై ఆర్‌బీఐ లిమిట్
రూపాయి పతనాన్ని ఆపేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకుల రూపాయి అమ్మకం, కొనుగోళ్లపై పరిమితులు విధించింది. ఇండియా ఫారెక్స్ మార్కెట్ (డెలివరీ జరిగే ఆన్‌షోర్ మార్కెట్)లో బ్యాంకులు తీసుకున్న నెట్ ఓపెన్ పొజిషన్స్ (ఎన్‌ఓపీ) విలువ 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.950 కోట్లు) దాటకూడదని ఆదేశించింది. ఓవర్ నైట్‌లో పొజిషన్ కొనసాగించాలంటే ఈ పరిమితికి మించి పొజిషన్ వాల్యూ ఉండకూడదు. దీంతో బ్యాంకుల పొజిషన్ సైజ్ తగ్గుతుంది. డాలర్‌తో రూపాయి విలువ పడుతుందని బ్యాంకులు ఏకంగా 30–40 బిలియన్ డాలర్ల విలువైన పొజిషన్లు తీసుకున్నాయని అంచనా.
ప్రస్తుతం బ్యాంకులు తమ క్యాపిటల్‌లో (బోర్డ్ ఆమోదం పొందాక) 25 శాతం వరకు ఫండ్స్‌తో ఓపెన్ పొజిషన్ తీసుకోవచ్చు. ఆర్‌బీఐ తాజా రూల్ ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానుండగా, బ్యాంకులు ఇప్పటికే అమ్మిన (షార్ట్ చేసిన) తమ రూపాయి పొజిషన్లను ఎగ్జిట్ (డాలర్లు అమ్మడం) అవ్వాల్సి ఉంటుంది. దీంతో రూపాయికి మద్దతు దొరుకుతుంది. కానీ, ఈ రూల్‌ను అమలు చేయడానికి టైమ్ తక్కువగా ఉందని, ఇప్పుడు ఎగ్జిట్ అయితే నష్టాలు వస్తాయని, మూడు నెలల పాటు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని బ్యాంకులు కోరుతున్నాయి. దీనిపై ఇంకా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోలేదు.
సెన్సెక్స్ 1,635 పాయింట్లు డౌన్
బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ 2025–26 ఆర్థిక సంవత్సరపు చివరి ట్రేడింగ్ సెషన్‌లో భారీగా పడ్డాయి. వెస్ట్ ఆసియా యుద్ధం కొనసాగుతుండటం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలు, ఆసియా మార్కెట్లు నెగెటివ్‌లో ట్రేడవ్వడంతో సోమవారం రెండు శాతానికి పైగా నష్టపోయాయి.
సెన్సెక్స్ 1,635 పాయింట్లు (2.22శాతం) పడిపోయి 71,947 వద్ద, నిఫ్టీ 488 పాయింట్లు (2.14శాతం) తగ్గి 22,331 వద్ద ముగిశాయి. రెండు రోజుల్లో సెన్సెక్స్ 3,325 పాయింట్లు, నిఫ్టీ 975 పాయింట్లు కోల్పోయాయి. మొత్తం ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ ఏడు శాతం తగ్గగా, నిఫ్టీ ఐదు శాతం పడిపోయింది.
ఒక్క సోమవారం సెషన్‌లో రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తగ్గగా, రెండు రోజుల్లో రూ.18 లక్షల కోట్లు ఆవిరైంది. బ్యాంకింగ్ షేర్లు ఆర్‌బీఐ కొత్త ఫారెక్స్ పరిమితుల కారణంగా సోమవారం ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీలో ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు టాప్ లూజర్లు కాగా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ మాత్రం లాభల్లో ముగిశాయి. విదేశీ పెట్టుబడిదారులు సోమవారం నికరంగా రూ.11,163 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. మార్చిలో రికార్డ్ లెవెల్లో రూ.1.14 లక్షల కోట్ల ( 12.3 బిలియన్ డాలర్ల) ను విత్‌డ్రా చేసుకున్నారు.
100 దాటితే డేంజరే!
* రూపాయి విలువ మరింత పడి 100 లెవెల్ దాటితే, ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై అసమానంగా ఉంటుంది. ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్స్ వంటి ఎగుమతి రంగాలకు లాభం ఉంటుంది. డాలర్ ఆదాయం రూపాయిల్లోకి మారినప్పుడు ఎక్కువగా వస్తుంది. మార్జిన్స్ పెరుగుతాయి.
* ఆయిల్ మార్కెటింగ్ , ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, తయారీ వంటి దిగుమతి ఆధారిత రంగాల ఖర్చులు పెరుగుతాయి. ఇంధనం, ముడి పదార్థాలు, టెక్నాలజీ దిగుమతులు ఖరీదవుతాయి. ధరలు ఇంకా పెరుగుతాయి.
* రూపాయి ఒక్కసారిగా పడిపోతే ఫారిన్ ఇన్వెస్టర్లు తమ క్యాపిటల్‌ను వెనక్కి తీసుకుంటారు. ఈక్విటీ, డెట్ మార్కెట్లు పడతాయి. వోలాటాలిటీ వలన బ్యాంకులు, ఫైనాన్షియల్ మార్కెట్లు నష్టపోతాయి.
* దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ) పెరుగుతుంది. దిగుమతులు ఖర్చు మరింత పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. రూపాయికి మద్ధతు ఇవ్వడానికి ఆర్‌బీఐ ఫారెక్స్ నిల్వలను అమ్మాల్సి వస్తుంది. మరింత జోక్యం చేసుకోవాల్సి వస్తుంది.