
ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం
10 రోజుల పాటు జరిగిన సమావేశాలు
మొత్తం 82 గంటల 47 నిమిషాలపాటు జరిగిన శాసనసభ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. 10 రోజుల పాటు జరిగిన శాసనసభా సమావేశాల్లో మొత్తం 82 గంటల 47 నిముషాలు ప్రజా సమస్యలపై చర్చించారు. అందులో అధికార కాంగ్రెస్ పార్టీకి 66 గంటలు, ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్‌కు 37 గంటలు, బిజెపి పార్టీకి 8 గంటలు, ఎంఐఎంకు 7 గంటలు, సిపిఐ పార్టీకి ఒక గంట పాటు సమయం కేటాయించారు. ఈ సమావేశాలలో ప్రభుత్వం మూడు తీర్మానాలు, 11 బిల్లులు ప్రవేశపెట్టగా, 10 బిల్లులు ఆమోదించి, ఒక బిల్లుకు సెలెక్ట్ కమిటీని పరిశీలనకు పంపించినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన 590 ప్రశ్నలకుగానూ ప్రభుత్వం 505 ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఇందులో 53 అన్‌స్టార్ ప్రశ్నలు, 68 స్టార్ ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు. డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లు 2026 శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టి చర్చించారు. అనంతర ఉభయ సభలు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తెలిపాయి. అనంతరం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈనెల 16న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు..సోమవారం (మార్చి 30) రాత్రి వరకు కొనసాగాయి. అంతకుముందుకు శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదించాల్సిన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఇది పీపుల్స్ బడ్జెట్‌గా ఆయన అభివర్ణిస్తూ కోటి 15 లక్షల కుటుంబాలు సంక్షేమ పథకాల లబ్ది పొందుతున్నాయని తెలిపారు. విద్యారంగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విప్లవాత్మకమైన విధానాలు అమలులోకి తీసుకువచ్చామని భట్టి కొనియాడారు. ద్రవ్యోల్భణం శాతం 2.8 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మనమంతా ముందు తెలంగాణవాదులం అని, పార్టీలకు అతీతంగా తమ ప్రజాపాలనకు సహకరిస్తూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.