Reading Time: 2 minutes

రూ. 3.50 లక్షలు ఇచ్చినా మళ్లీ డబ్బులు అడుగుతుందని చంపి ముక్కలు చేశాడు.. రక్తపు వాసన రాకుండా ఇల్లంతా సెంటు కొట్టాడు..!

Caption of Image.
  •     డబ్బుల విషయంలో గొడవే హత్యకు కారణం
  •     మర్డర్ తర్వాత పోలీసు స్టేషన్‌‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు

హైదరాబాద్, వెలుగు: ఏపీలోని విశాఖలో దారుణం జరిగింది. ఓ నేవీ ఉద్యోగి తన స్నేహితురాలిని ఇంటికి పిలిపించుకుని కత్తితో పొడిచి చంపాడు. సాక్ష్యాలను మాయం చేసేందుకు ఆమె డెడ్ బాడీని ముక్కలుగా నరికాడు. ఆ భాగాలను రెండు మూటల్లో కట్టి ఫ్రిజ్‌‌లో దాచిపెట్టాడు. పోలీసుల ప్రకారం..విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర(35)అనే వ్యక్తి విశాఖ నేవీలో టెక్నీషియన్‌‌గా పనిచేస్తున్నాడు. 

కరోనా లాక్‌‌డౌన్ టైంలో అతడికి ఒక డేటింగ్ యాప్ ద్వారా మౌనిక(29) అనే యువతితో పరిచయమైంది. రవీంద్ర భార్య నెల క్రితమే విజయనగరంలోని పుట్టింటికి వెళ్లడంతో అతను ఒంటరిగా ఉంటున్నాడు. ఆదివారం రాత్రి రవీంద్ర తన పాత పరిచయస్తురాలైన మౌనికను ఇంటికి పిలిచాడు. ఆమె ఇంటికి వచ్చిన కాసేపటికే డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ ఆవేశంలో  మౌనికను రవీంద్ర కత్తితో పొడిచి చంపేశాడు. 

మౌనికను చంపిన తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి, రెండు మూటల్లో కట్టి ఫ్రిజ్‌‌లో పెట్టాడు.  మౌనిక తలను, మొబైల్ ఫోన్‌‌ను దారపాలెం సమీపంలోని తోటల్లోకి తీసుకెళ్లి తగులబెట్టాడు. అనంతరం మళ్లీ ఇంటికి వచ్చి మరకలను కడిగేసి, రక్తపు వాసన రాకుండా ఇల్లంతా సెంటు కొట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడు హెచ్చరించడంతో భయపడిన రవీంద్ర.. నేరుగా పోలీసు స్టేషన్‌‌కు వెళ్లి లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు ఆ తల భాగం కోసం దారపాలెం ప్రాంతంలో గాలిస్తున్నారు. 

పథకం ప్రకారమే హత్య

రవీంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాను మౌనికకు గతంలో రూ. 3.50 లక్షలు ఇచ్చానని.. ఆమె డబ్బుల కోసం ఇంకా వేధిస్తోందని, ఆ వేధింపులు భరించలేకే హత్య చేశానని నిందితుడు పోలీసులకు వివరించాడు. అయితే, మౌనికను రవీంద్ర పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం మౌనికను తన అపార్ట్‌‌మెంట్‌‌కు పిలిపించడానికి ముందే, అతను గాజువాకలో కత్తులను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నాడని వివరించారు. దీనిని బట్టి ఇది ఆవేశంలో జరిగిన హత్య కాదని, ముందస్తు ప్రణాళికతో చేసిన ఘాతుకమన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.