Reading Time: 2 minutes

నక్సలిజం ముగిసినట్టే.. ప్రజల సహకారంతో ఇది సాధ్యమైంది: అమిత్ షా

Caption of Image.
  • ఆయుధాలు పట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవు
  • మావోయిస్టుల నుంచి బస్తర్ విముక్తి  పొందింది..
  • అక్కడ అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి
  • రష్యా, చైనాకు  మద్దతుగా సీపీఐ, సీపీఎం ఏర్పడ్డాయి
  • తుపాకీ గొట్టంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో సీపీఐ (ఎంఎల్) వచ్చింది
  • కాంగ్రెస్ నిర్లక్ష్యమే మావోయిజానికి కారణమని ఆరోపణ

న్యూఢిల్లీ: దేశంలో మావోయిజం ఇక ముగిసినట్టేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. మోదీ పాలనలో దేశంలో నక్సలిజం అంతరించిపోయే దశకు చేరిందని, రెడ్ టెర్రరిజాన్ని పూర్తిగా తుదముట్టించామని అన్నారు. ఎవరైనా ఆయుధాలు వదలకపోతే వారి అంతు చూస్తామని అమిత్ షా హెచ్చరించారు. అదే సమయంలో కేంద్రం అన్ని సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని కూడా స్పష్టం చేశారు. మావోయిస్టుల లొంగుబాటుకు మార్చి 31 డెడ్​లైన్​ అని తెలిపారు. 

తెలంగాణ, ఏపీ, చత్తీస్‌గఢ్, కేరళం, జార్ఖండ్, యూపీతో కలిసి రెడ్ కారిడార్ ఉండేదని, దాని వల్ల సుమారు 12 కోట్ల మంది ఎఫెక్ట్​అయ్యారని అమిత్ షా వివరించారు. బస్తర్ మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని, అక్కడి ఆదివాసీలకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని పునరావాస ప్రయోజనాలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అయితే ఆయుధాలు పట్టుకున్న వారితో ఎలాంటి చర్చలు ఉండవని కూడా స్పష్టం చేశారు. 

నక్సలిజం వల్లే రెడ్ కారిడార్​లో పేదరికం
నక్సలిజం పేదరికం, డెవలప్​మెంట్ లేకపోవడం వల్ల వ్యాపించలేదని, నక్సల్స్​ప్రభావం ఉన్న ప్రాంతాలు పేదరికంలో మిగిలిపోయాయని అమిత్​షా అన్నారు. రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలను స్థాపించడానికి మద్దతిచ్చిందన్నారు.  1925లో భారత దేశంలో సీపీఐ ఏర్పడిందని, చైనాను సపోర్ట్ చేయడం కోసం 1964లో సీపీఎం ఏర్పడిందని చెప్పారు. 

ప్రస్తుత సాయుధ మావోయిస్టులు వారి వారసులే అని అమిత్ షా అన్నారు. పార్లమెంటరీ రాజకీయాలను వ్యతిరేకిస్తూ.. సాయుధ తిరుగుబాటు లక్ష్యంగా 1969లో సీపీఐ (మార్క్సిస్ట్- లెనినిస్ట్) ఏర్పాటైందని తెలిపారు.
ఆపరేషన్​ కగార్​తో అంతిమ దశకు 2024లో ఆపరేషన్​ కగార్​ చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్‌కౌంటర్లలో 530 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు.

2,004 మంది అరెస్ట్ అయ్యారు. 2,700 మందికి పైగా లొంగిపోయారు. గతంలో 180కి పైగా జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండగా ఇప్పుడు 3 నుంచి 4 జిల్లాలకే పరిమితమైంది. భద్రతా సంస్థల తాజా అంచనాల ప్రకారం, దేశంలో ఇప్పుడు మావోయిస్ట్ కేడర్ 350 మంది కంటే తక్కువే ఉందని సమాచారం. 

అందులోనూ బస్తర్, అబుజ్‌మడ్ ప్రాంతాల్లో 100 నుంచి 150 మంది సాయుధ సభ్యులు ఉన్నారని చెప్తున్నారు. ఒకప్పుడు 40–45 మంది సభ్యులున్న కేంద్ర కమిటీ, ప్రస్తుతం 5 నుంచి 6 మందికే పరిమితమైంది. మావోయిస్టు అగ్రనేత గణపతి (ముప్పాళ్ల లక్ష్మణరావు) సరెండర్ అయ్యేందుకు తెలంగాణ పోలీసులను సంప్రదిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.

©️ VIL Media Pvt Ltd.