Reading Time: 2 minutes

49 సంస్థలు ఆడిట్‌కు సహకరించలేదు..

మూసివేత దిశగా 16 సంస్థలు

6 సంస్థలు లాభాలు, 11 సంస్థలు నష్టాల్లో…

సింగరేణిలో రూ.251 కోట్ల మేర నిధులు దుర్వినియోగం

సింగరేణి బొగ్గు రవాణాలో లోపాల వల్ల రూ.25 కోట్ల నష్టం

కాగ్ నివేదికలో వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చింది. 2023 మార్చి వరకు ఉన్న గణాంకాలను విశ్లేషించిన కాగ్ ఆయా సంస్థల నష్టాలు, వార్షిక బడ్జెట్ వివరాల గురించి వెల్లడించింది. కాగ్ 2022, 23 సంవత్సరానికి సంబంధించి పలు శాఖల పనితీరు, వాటి వివరాలను కాగ్ అసెంబ్లీకి నివేదించింది. రాష్ట్రంలోని మెజారిటీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని, కనీసం లెక్కలు సమర్పించడంలోనూ నిర్లక్ష్యం వహించాయని కాగ్ స్పష్టం చేసింది.

రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, వాటిలో 16 సంస్థలు ఇప్పటికే మూతపడటం లేదా లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్నాయని, మిగిలిన 67 సంస్థల్లో ఏకంగా 49 సంస్థలు తమ వార్షిక ఖాతాలను సమర్పించలేదని, కేవలం 18 సంస్థలు మాత్రమే ఆడిటింగ్‌కు సహకరించాయని కాగ్ ఈ నివేదికలో తెలిపింది. 18 సంస్థల్లో కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉండగా, 11 సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయని కాగ్ పేర్కొంది. 9 సంస్థల నెట్‌వర్త్ (నికర విలువ) నష్టాల కారణంగా పూర్తిగా కరిగిపోయిందని, మొత్తం మీద ఈ సంస్థల నెట్ వర్త్ రూ.50,930 కోట్లకు పడిపోయిందని కాగ్ తెలిపింది.

ఈ సంస్థల్లో ప్రభుత్వం చేసిన మొత్తం పెట్టుబడులు రూ.98,572 కోట్లు కాగా, సింగరేణి కాలరీస్‌పై కాగ్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించి అవకతవకలను గుర్తించింది. కొన్ని ఒప్పందాల్లో అవసరానికి మించి డీజిల్ వినియోగించినట్లు గుర్తించింది. కాంట్రాక్టుల్లోని లోపాల వల్ల రూ.251 కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయని నిబంధనలను అమలు చేయడంలో రూ.74 కోట్ల అదనపు భారం పడగా, బొగ్గు రవాణాలో లోపాల వల్ల రూ.25 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చింది. ట్రాన్స్‌ఫోర్ట్ ఛార్జీల పేరుతో రూ.1,078 కోట్ల అదనపు వసూళ్లు జరిగినట్లు కాగ్ నివేదికలో తెలిపింది. .

15 సంస్థల్లో 9 సంస్థలకు స్వతంత్ర డైరెక్టర్లే లేరు

సంస్థల పాలనలో తీవ్ర లోపాలున్నట్లు నివేదిక వేలెత్తి చూపింది. 15 సంస్థల్లో 9 సంస్థలకు స్వతంత్ర డైరెక్టర్లే లేరని ఎక్కడా డైరెక్టర్ల సమావేశాలు నిర్వహించలేదని 5 సంస్థల్లో ఆడిట్ కమిటీలు, 9 సంస్థల్లో ఎన్‌ఆర్‌సి లేదని నివేదికలో కాగ్ తెలిపింది. పర్యావరణ నిబంధనలను పాటించడంలో సింగరేణి విఫలమైందని, ఎఫ్లువెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదని కాగ్ పేర్కొంది. నష్టాల్లో ఉన్న సంస్థల పనితీరుపై ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలని కాగ్ సూచించింది. పెండింగ్‌లో ఉన్న వార్షిక ఖాతాలను వెంటనే పూర్తి చేసి సమర్పించాలని, కాంట్రాక్టుల్లో లొసుగులు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కాగ్ నివేదికలో పేర్కొంది.