
మనతెలంగాణ/హైదరాబాద్: సాదాబైనామాలకు అడ్డంకులు తొలిగాయి. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 9 లక్షల దరఖాస్తుదారులకు మేలు జరిగేలా ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి సంబంధించి జిఓ 76, 77లను రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్‌కుమార్ జారీ చేశారు. ఈ జిఓలతో సాదాబైనామాల దరఖాస్తులకు అడ్డంకులు తొలగినట్టయ్యింది. భూభారతి చట్టం ద్వారా వాటి పరిష్కారానికి మార్గం లభించినా అనేక అడ్డంకులతో సాదాబైనామాలకు మోక్షం కలగడం లేదు, దీంతో రెవెన్యూ శాఖ ఈ రెండు జీఓల ద్వారా ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం చేసింది. దరఖాస్తులను క్లియర్ చేసేందుకు జిల్లా కలెక్టర్లు అవలంబించాల్సిన కార్యాచరణ మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.
2016 తరువాత జమాబందీ నిలిచి పోవటంతో రికార్డుల్లో మార్పులు, చేర్పులు
సాదాబైనామాను పరిష్కారించాలంటే భూమి విక్రయించిన వ్యక్తుల నుంచి అఫిడవిట్‌తో పాటు కొనుగోలు చేసిన వారి దగ్గర సరైన పత్రాలు ఉండాలి. గత ప్రభుత్వ హయం నుంచే పలుమార్లు సాదాబైనామా తెరపైకి రాగా, తెల్లకాగితాలపై చేసుకున్న భూ క్రయ, విక్రయాల సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వం ప్రతిసారి సాదాబైనామాల విషయాన్ని ప్రస్తావిస్తున్నా పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదు. దీనికి ప్రధానంగా గత యజమానుల అఫిడవిట్ లేక పోవడం, వారుసులు అభ్యంతరాలు తెలపడం, 2016 తరువాత జమాబందీ నిలిచి పోవటంతో రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేయటం కష్టంగా మారింది. తాజాగా విక్రయించిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాల్సిందేనని, కొనుగోలు చేసిన వ్యక్తి తప్పుడు రికార్డు సృష్టిస్తే చర్యలకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి వివాదాలు లేనట్లయితేనే దరఖాస్తులను పరిష్కరించి పట్టా జారీ చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించింది. తెల్లకాగితాలు, స్టాంప్ పేపర్ల ఆధారంగా భూములు కొనుగోలు చేసిన వారు వాటిని సాగు చేసుకుంటున్నప్పటికీ పలు సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ప్రభుత్వం ఈ మార్పులు, చేర్పులను చేస్తూ కొత్తగా జిఓలను జారీ చేసింది.
జీఓ నెం.76 ప్రకారం భూమిని కొనుగోలు చేసి వ్యక్తి అఫిడవిట్ ఇస్తే
అయితే, అమ్మిన వ్యక్తి కాదు కొన్న వ్యక్తి భూభారతి చట్టంలోని సెక్షన్ (6) ప్రకారం సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించే వెసులుబాటు కల్పించినా ఆ తర్వాత రెవెన్యూ శాఖ జారీ చేసిన నిబంధనలు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఎప్పుడో కొన్న భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లావాదేవీ కోసం అప్పట్లో అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధన ఇబ్బందిగా మారింది. ఈ నిబంధనపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం కావడం, రైతులు ఇబ్బందులు పడుతుండడంతో ఆ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.76 జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం భూమిని కొనుగోలు చేసి వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అఫిడవిట్‌తో పాటు ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్డీఓ పరిశీలిస్తారు.
సదరు అఫిడవిట్ సమర్పించిన దరఖాస్తులు 30 రోజుల పాటు పెండింగ్‌లో పెడతారు. ఈలోపు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే అఫిడవిట్‌తో పాటు డాక్యుమెంట్లను పరిశీలించి సదరు రైతుకు సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేస్తారు. అయితే, కొనుగోలు చేసిన వ్యక్తి ఇచ్చే అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఉందని ఎప్పుడు తేలినా సదరు సర్టిఫికెట్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కోసం రైతు చెల్లించే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును వెనక్కి ఇవ్వరు. దీంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చిన రైతులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం అయినా జిఓ 77 కింద పరిష్కారం
గ్రామాలుగా ఉన్నప్పుడు సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించినా ప్రస్తుతం ఆ గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం అయినా ఆ దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుగా జీఓ నెంబర్‌ను 77 జారీ చేశారు. కొత్తగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటయినప్పుడు చాలా గ్రామాలు వాటిలో విలీనం అయ్యాయి. భూభారతి చట్దానికి అనుగుణంగా ఆయా గ్రామాల్లో సాదాబైనామాలు చేయాలా వద్దా అనే దానిపై రెవెన్యూ అధికారులకు స్పష్టత లేదు.
దీంతో ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేరకు పట్టణాల్లో కలిసిన గ్రామీణ ప్రాంతాల్లోని సాదాబైనామాల పరిష్కారానికి 77 జీఓలో వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేసే నాటికి అమల్లో ఉన్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక, క్షేత్రస్థాయిలో ఈ సాదాబైనామా దరఖాస్తుల ప్రక్రియ పరిష్కారం కోసం అవసరమైన కార్యాచరణ మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లకు జారీ చేసేలా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఏ)కు అనుమతినిస్తున్నట్టు ఈ జిఓలో ఉత్తర్వులు జారీ చేశారు.