Reading Time: 2 minutes

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం వంటింటి పైనా పడింది. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడటంతో దేశంలో గ్యాస్, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌సమస్యను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. కిరోసిన్- రహితంగా ప్రకటించిన 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా సుపీరియర్‌ కిరోసిన్‌ను తాత్కాలికంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.

కేవలం వంట, దీపాలు వెలిగించడం కోసమే షరతులకు లోబడి ఈ పంపిణీ చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో పాటు లైసెన్స్ పొందిన సర్వీస్ స్టేషన్లలో 2,500 లీటర్ల వరకూ కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది. సుపీరియర్ కిరోసిన్ అనేది ముడిచమురు రిఫైనరీ ప్రక్రియను నుంచి వచ్చే ఉప ఉత్పత్తి. ఇది అత్యంత శుద్ధి చేసిన కిరోసిన్. దీన్ని ప్రధానంగా వంటకు, దీపాలు వెలిగించేందుకు వినియోగిస్తారు. సాధారణ లో గ్రేడ్ కిరోసిన్‌తో పోలిస్తే ఇందులోంచి వెలువడే వాయువులు తక్కువ. పొగ కూడా తక్కువగా వస్తుంది.

పశ్చిమ ఆసియాలో నెలరోజులుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు దెబ్బతింది. ముఖ్యంగా వంటగ్యాస్ సరఫరా ప్రభావితమైంది. భారత్ తన అవసరాల్లో సుమారు 60 శాతం ఎల్పీజీ దిగుమతి చేసుకుంటుండగా, అందులో 85-90 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. యుద్ధ పరిస్థితుల వల్ల ఈ సరఫరా నిలిచిపోవడంతో, హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు సరఫరా తగ్గించాల్సి వచ్చింది.ఇంటి వాడుకకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పరిమిత నిల్వల కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొని, గ్యాస్ కోసం భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎల్పీజీపై ఒత్తిడి తగ్గించేందుకు దేశవ్యాప్తంగా కిరోసిన్ వినియోగాన్ని కేంద్రం తాత్కాలికంగా అనుమతించింది.

పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ మార్చి 29న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, పెట్రోలియం చట్టం-1934, పెట్రోలియం నిబంధనలు-2002 కింద తాత్కాలిక మినహాయింపులు ఇస్తునట్లు తెలిపింది. దీని ప్రకారం ప్రతి జిల్లాలో గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సర్వీస్ స్టేషన్లలో 5,000 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేయడానికి అనుమతి ఉంటుంది. అయితే భద్రతా నిబంధనలను పాటించడం తప్పనిసరి. కిరోసిన్ డీకాంటింగ్ (నిల్వ నుంచి పంపిణీ) కోసం ఏజెంట్లు, డీలర్లు ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఇప్పటికే అనుమతులు ఉన్న ట్యాంకర్ వాహనాలకు అదనపు అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది.