Reading Time: < 1 minute

గౌహతి: ఐపిఎల్ సీజన్ 2026లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. సోమవారం గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యా చ్‌లో రాజస్థాన్ 8 వికెట్ల తేడా తో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్ బౌలర్లు ఆరంభం నుంచే మెరుగ్గా బౌలింగ్ చేశారు. ఓపెనర్లు సంజు శాంసన్ (6), రుతురాజ్ గైక్వాడ్ (6) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆయూస్ మాత్రె (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. మాథ్యూ షార్ట్ (2) కూడా నిరాశ పరిచాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన సర్ఫరాజ్ ఖాన్ (17) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. కార్తీక్ శర్మ (18) పరుగులు చేశాడు. శివమ్ దూబె (6), నూర్ అహ్మద్ (1), మ్యాట్ హెన్రీ (5) జట్టుకు అండగా నిలువలేక పోయారు. జేమీ ఓవర్టన్ (43) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఆర్చర్, బర్గర్, జడేజా రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 12.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 17 బంతుల్లోనే 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో 52 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. యశస్వి జైస్వాల్ 38 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు.