
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఫార్మాస్యూటికల్ రంగంపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా బల్క్ డ్రగ్స్ లేదా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ (APIs) సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పాటు ధరలు విపరీతంగా పెరగడం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో నిల్వలు, నల్లబజారును అరికట్టేందుకు ‘నిత్యావసర వస్తువుల చట్టం’ను అమలు చేయాలా అనే అంశంపై కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది. దీనిపై స్పష్టమైన అంచనాకు రావడానికి ప్రభుత్వం పరిశ్రమ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, త్వరలోనే స్థిరపడుతుందని పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అయితే ప్రస్తుతం ఎదురవుతున్న ధరల పెరుగుదల మాత్రం అసాధారణ స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం, కొన్ని కీలక ముడి పదార్థాల ధరలు 200 నుంచి 300 శాతం వరకు పెరిగాయి. కేవలం గత కొన్ని వారాల్లోనే APIs ధరలు సగటున 30 నుంచి 35 శాతం పెరగగా, గ్లిజరిన్ ధర 64 శాతం, పారాసెటమాల్ 25 శాతం, సిప్రోఫ్లోక్సాసిన్ 30 శాతం పెరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్యాకేజింగ్ రంగం కూడా ఈ ప్రభావానికి అతీతంగా లేదు. పాలీవినైల్ క్లోరైడ్ (PVC), అల్యూమినియం ఫాయిల్ వంటి పదార్థాల ధరలు సుమారు 40 శాతం వరకు పెరగడం తయారీ ఖర్చులను మరింత పెంచుతోంది. పీఎన్‌జీ కొరత, కంటైనర్ల లభ్యతలో సమస్యలు రవాణా వ్యవస్థపై అదనపు ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచ్యురల్ గ్యాస్‌తో కలిసి పరిశ్రమ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు.
గ్లిజరిన్, ప్రొపైలిన్ గ్లైకాల్ వంటి ద్రవ ఔషధాల తయారీలో కీలకమైన పదార్థాల ధరలు పెరగడంతో సిరప్‌లు, ఓరల్ డ్రాప్స్, స్టెరైల్ మందుల తయారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీలు మాత్రమే కాకుండా ప్యాకేజింగ్ సరఫరాదారులపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 సమయంలో అమలు చేసిన ప్రత్యేక మినహాయింపులను తిరిగి అమలు చేయాలని పరిశ్రమ కోరుతోంది. రవాణా రాయితీలు, లాజిస్టిక్స్ మద్దతు వంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తగిన చర్యలు తీసుకోకపోతే, దేశీయంగా ఔషధాల అందుబాటు మాత్రమే కాకుండా, భారతీయ ఔషధాలపై ఆధారపడిన అంతర్జాతీయ సరఫరా గొలుసుపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి