Reading Time: 2 minutes

సెలెక్ట్‌‌ కమిటీకి హేట్ స్పీచ్‌‌ బిల్లు.. ప్రకటించిన స్పీకర్ ప్రసాద్‌‌ కుమార్‌‌‌‌

Caption of Image.
  • సభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌
  • రాష్ట్రంలో కొన్నేండ్లుగా విద్వేష ప్రసంగాలు పెరిగాయని వెల్లడి
  • డిజిటల్‌‌, సోషల్‌‌ మీడియా విచ్చలవిడితనంతో సమస్యలు వస్తున్నాయని మండిపాటు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో ‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేష నేరాల నివారణ బిల్లు – 2026’ను సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. తర్వాత బిల్లును సెలెక్ట్‌‌‌‌ కమిటీ పంపుతున్నట్లు స్పీకర్‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌ కుమార్‌‌‌‌ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ‘‘కొన్నేండ్ల నుంచి విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల వంటి ఘటనలు పెరిగిపోయాయి. 

ప్రధానంగా డిజిటల్‌‌‌‌, సోషల్‌‌‌‌ మీడియాలో ఇది మరింత పెరిగింది. ఇలాంటి ప్రసంగాలు సోషల్‌‌‌‌ మీడియా ద్వారా వేగంగా వ్యాపించి శాంతి భద్రతలు, సామాజిక సామరస్యానికి హాని కలిగిస్తాయి. మతం, కులం, జాతి, భాష, లింగ భేదం ఆధారంగా శత్రుత్వాన్ని, అసమ్మతిని ప్రోత్సహిస్తాయి. రాష్ట్రంలో సమానత్వం, గౌరవం వంటి రాజ్యాంగ విలువలను దెబ్బతీస్తాయి. ప్రస్తుతం ఉన్న చట్టం ఇలాంటి వాటిని పరిష్కరించడం లేదు. ఇలాంటి ప్రవర్తనను నివారించడం, బాధితులకు రక్షణ, పరిహారం అందించడానికి ఒక ప్రత్యేకమైన, పటిష్టమైన చట్టం అవసరం. అందుకే ఈ బిల్లు ప్రవేశపెడుతున్నాం’’ అని వెల్లడించారు.

సోషల్‌‌‌‌ మీడియా మిస్‌‌‌‌ యూజ్‌‌‌‌ అవుతోంది: దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌ 
ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది.. కానీ సోషల్‌‌‌‌ మీడియా విషయంలో అడ్డూఅదుపు లేకపోవడంతో తప్పుడు ప్రచారం పెరిగిపోతోందని ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. తప్పుడు ప్రచారం ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో గుర్తించి, ఆ మెసేజ్‌‌‌‌ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ.. తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేష నేరాల (నివారణ) బిల్లు 2026 ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. సోషల్ మీడియాలో ఫేక్‌‌‌‌ పోస్టులు పెడుతుండడంతో కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని, చివరకు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయన్నారు. 

బిల్లును వ్యతిరేకిస్తున్నాం: కూనంనేని
హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సంతాప సభ పెట్టి మాట్లాడితే కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. ఈ బిల్లులో సెక్షన్లపై క్లారిటీ లేదన్నారు. ఈ బిల్లును ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపాలని సూచించారు.

వ్యాట్‌‌‌‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి జూపల్లి.. 
‘తెలంగాణ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (టీవ్యాట్), మొబిలిటీ (రిలయన్స్‌‌‌‌ బీపీ మొబిలిటీ లిమిటెడ్‌‌‌‌) సవరణ బిల్లు–2026’ను మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సంద‌‌‌‌ర్భంగా మంత్రి జూప‌‌‌‌ల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటి అమ్మకపు దశలో మాత్రమే పన్ను విధించే నిబంధనను రిలయన్స్‌‌‌‌ బీపీ మొబిలిటీ లిమిటెడ్‌‌‌‌ తమ అంతర్గత లావాదేవీల ద్వారా అనుకూలంగా మార్చుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ లోపాన్ని సరిదిద్ది, ఖజానాకు రావాల్సిన పన్ను వాటాను సక్రమంగా రాబట్టేందుకు బిల్లులో సవరణ చేస్తున్నట్లు ప్రకటించారు. 

2025 జూన్‌‌‌‌ 18న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు (జీవో ఎంఎస్ నంబర్ 73) ఈ బిల్లు ద్వారా చట్టబద్ధత కల్పించేందుకు స‌‌‌‌వ‌‌‌‌ర‌‌‌‌ణ బిల్లును స‌‌‌‌భలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ బిల్లు ప్రధానంగా రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించడం, ఇంధన విక్రయాల్లో పన్ను లొసుగులను అరికట్టడం లక్ష్యంగా రూపొందించామని చెప్పారు. బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడిన తర్వాత బిల్లు ఆమోదం పొందినట్లు మంత్రి జూపల్లి ప్రకటించారు. 

రాష్ట్రాన్ని గత ప్రభుత్వం దివాళా తీయించింది: పొన్నం 
గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ అన్నారు. ప్రజాపాలనలో రాష్ట్రంలో వ్యాట్, ఎక్సైజ్‌‌‌‌ ట్యాక్స్ శాతాన్ని పెంచలేదన్నారు. కేంద్రం అన్ని విషయాల్లో సహకరించడం లేదని విమర్శించారు. కేంద్రం పన్నుల పరిహారాన్ని ఇవ్వడం డ్యూటీలో భాగమని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్‌‌‌‌పై 10 శాతం ఎక్సైజ్‌‌‌‌ డ్యూటీని తగ్గించిందని విమర్శించారు. 

పెట్రోల్‌‌‌‌పై ట్యాక్స్‌‌‌‌ తగ్గించాలి: పాయల్ శంకర్
రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్‌‌‌‌పై ప్రభుత్వం ట్యాక్స్‌‌‌‌ తగ్గించాలని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌‌‌‌ ధరలను తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బడా కంపెనీలు ఎగ్గొట్టిన పన్నులను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలని డిమాండ్ చేశారు. 

ట్యాక్స్‌‌‌‌ల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి నుంచి రూ.4 లక్షల కోట్లు ఇస్తుంటే.. కేంద్రం రూ.1.70 లక్షల కోట్లు మాత్రమే తిరిగివ్వడం సరికాదన్నారు. హైదరాబాద్‌‌‌‌లో చాలా హోటళ్లు పన్నులను ఎగ్గొట్టాయని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని దానం నాగేందర్ సూచించారు. రిలయన్స్‌‌‌‌ కంపెనీకి ఉపయోగపడేలా చట్ట సవరణ చేసినట్లుగా ఉందని పాల్వాయి హరీశ్‌‌‌‌ అభిప్రాయపడ్డారు. అంబానీ, అదానీలు కేంద్రం నియంత్రణలో ఉన్నారని, రాష్ట్రంలో వాళ్లకు ఫేవర్ చేయడమేంటని దానం కౌంటర్ ఇచ్చారు.

©️ VIL Media Pvt Ltd.