Reading Time: 3 minutes

తెలంగాణలో కుటుంబ విలువలను కాపాడే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం ఆమోదించిన తల్లిదండ్రుల మద్దతు బిల్లు వృద్ధుల సంరక్షణను చట్టబద్ధ బాధ్యతగా మలుస్తోంది. వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితుల్లో కుటుంబ బంధాలు సడలుతున్న నేపథ్యంలో తీసుకున్న ఈ చర్య సమయోచితమనే చెప్పాలి. తల్లిదండ్రులపట్ల బాధ్యతను విస్మరించేవారికి కఠిన సందేశం ఇస్తూనే, వృద్ధుల గౌరవానికి భరోసా కల్పించే దిశగా ఈ బిల్లు ముందడుగుగా నిలుస్తోంది. భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ అనే సూత్రం శాశ్వతమైనది. కానీ ఆధునిక జీవనశైలిలో వేగంగా పెరుగుతున్న నగరీకరణ, వలసలు, వ్యక్తివాదం వంటి పరిణామాల నేపథ్యంలో కుటుంబ బంధాలు క్రమంగా సడలుతున్నాయి. ఈ మార్పుల ప్రభావం అత్యంత స్పష్టంగా కనిపిస్తున్న వర్గం వృద్ధులు. ఆర్థిక అసురక్షితత, ఆరోగ్య సమస్యలు, భావోద్వేగ ఒంటరితనం- ఇవి వారి దైనందిన వాస్తవాలుగా మారుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో జనవరి 12, 2026న సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్టుగా, బడ్జెట్ సెషన్‌లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు కేంద్ర Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007ని రాష్ట్ర స్థాయిలో కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదించిన బిల్లు ప్రకారం, తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా రూ. 10,000 (ఏది తక్కువైతే అది) కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధానం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది -కుటుంబ బాధ్యతను విస్మరించడం సహించబోమని. ఇది నైతిక బాధ్యతను చట్టబద్ధ బాధ్యతగా మలచే ప్రయత్నంగా చెప్పాలి. అయితే ఈ బిల్లులో అత్యంత గమనార్హ అంశం-దాని అమలు విధానంలో ఉన్న సమతుల్యత. తల్లిదండ్రుల ఫిర్యాదు వచ్చిన వెంటనే శిక్ష విధించడం కాకుండా, సంబంధిత ఉన్నతాధికారుల సమగ్ర విచారణ అనంతరం మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రశంసనీయం. కుటుంబ విభేదాలు అనేక కోణాల్లో ఉండే సందర్భంలో, ఒకపక్ష నిర్ణయాలకు తావు లేకుండా వ్యవస్థను రూపొందించడం పరిపక్వతకు నిదర్శనం. ఈ విధానం చట్ట దుర్వినియోగ అవకాశాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది.

ఇప్పటికే దేశంలో అమల్లో ఉన్న వృద్ధులకు చట్టపరమైన రక్షణను అందిస్తున్నప్పటికీ, దాని అమలులో అనేక పరిమితులు ఉన్నాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు, ఆ చట్టాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేసే దిశగా ఒక పూరక చర్యగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు విధానం, వృద్ధులకు తక్షణ ఉపశమనాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రివర్గం మొత్తం ఈ నిర్ణయాన్ని సమగ్రంగా పరిశీలించి ఆమోదించడం, కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక సమస్యలపై ఎంత సున్నితంగా స్పందిస్తోందో స్పష్టం చేస్తోంది. ఈ బిల్లుతోపాటు ఆమోదించిన హేట్ స్పీచ్ నిరోధక చట్టం, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం (4.2 లక్షల మందికి రిజిస్ట్రేషన్, సంక్షేమ బోర్డు)కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు భాగం. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు మాత్రమే కాకుండా సమాజం మొత్తానికి ఇది ఒక నైతిక హెచ్చరిక- బాధ్యతలను విస్మరించడాన్ని ప్రభుత్వం సహించదనే సందేశం. సామాజికంగా చూస్తే, ఈ నిర్ణయం ఒక హెచ్చరిక మాత్రమే కాదు ఒక అవగాహన పిలుపు. కుటుంబ విలువలను చట్టం ద్వారా కాపాడే ప్రయత్నం అరుదైనదే అయినప్పటికీ, అవసరమైనదిగా మారింది. పాఠశాల స్థాయి నుంచి సమాజం వరకు వృద్ధులపట్ల గౌరవాన్ని పెంపొందించే చర్యలు కూడా సమాంతరంగా సాగాల్సిన అవసరం ఉంది. చట్టం కేవలం నియంత్రణ సాధనం మాత్రమే కానీ విలువల మార్పు అవగాహన ద్వారానే సాధ్యం.

అయితే, ఈ బిల్లును అమలు చేసే ప్రక్రియలో సవాళ్లు లేవని చెప్పలేం. తల్లిదండ్రులను ఆదరించడం లేదనే అంశాన్ని కొలిచే ప్రమాణాలు స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సంబంధాలు స్వభావత: సంక్లిష్టమైనవి. ఆర్థిక సహాయం ఉన్నా భావోద్వేగ దూరం ఉండవచ్చు; లేదా వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వ్యవస్థ ఎలా స్పందిస్తుంది అన్నది కీలకం. అలాగే ప్రైవేటు రంగంలో వేతనాల నుంచి కోత విధించే విధానం చట్టపరంగా, సాంకేతికంగా స్పష్టత అవసరం. ఇంకా ఒక కోణంలో చూస్తే, ఈ బిల్లు సామాజిక భద్రతా వ్యవస్థలో ఉన్న లోటును కూడా ప్రతిబింబిస్తుంది. వృద్ధులు పూర్తిగా పిల్లలపై ఆధారపడకుండా ఉండేలా పింఛన్‌లు, ఆరోగ్య భద్రత, వృద్ధాశ్రమాలు వంటి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన చర్యలు మరింత విస్తరించాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి బలమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తోంది. పింఛన్ పథకాలు, ఆరోగ్య సేవలు, ‘ఇందిరమ్మ లైఫ్ ఇన్సూరెన్స్’ వంటి కార్యక్రమాలు కుటుంబాలపై ఒత్తిడి తగ్గించి, పరస్పర గౌరవం పెంచుతాయి. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం సామాజిక భద్రతా లోటును పూర్తి చేస్తూ, ‘ఇందిరమ్మ రాజ్యం’ స్ఫూర్తిని భావనాత్మకంగా అమలు చేస్తోంది. మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇందిరమ్మ రాజ్యం స్ఫూర్తిని ప్రతిబింబించే సంస్కరణ. ఇది కేవలం చట్టపరమైన మార్పు కాదు సామాజిక విలువలను పునరుద్ధరించే ఉద్యమం. సరైన అమలు, ప్రజల సహకారం ఉంటే, ఈ పథకం దేశానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. చివరగా ఒక స్పష్టమైన సందేశం ‘తల్లిదండ్రులను చూసుకోవడం కేవలం బాధ్యత కాదు, అది మన సంస్కృతి’. ఆ విలువలను కాపాడేందుకు ప్రభుత్వం ముందడుగు వేయగా, ప్రతి పౌరుడు కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.

అమరవాజీ నాగరాజు

(టిపిసిసి చీఫ్ పిఆర్‌ఒ)