
నక్సల్స్‌కి ఇవి తుది ఘడియలు
మోడీ సారథ్యంలో విజయం సాధించాం
ఇందిరాగాంధీ రాజకీయ స్వార్థంతోనే నక్సలిజం ఆవిర్భావం
కాంగ్రెస్ వైఖరితో గిరిజనులకు తీరని నష్టం
గద్దర్‌తో రాహుల్ గాంధీ చర్చలు దేనికి సంకేతం?
లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన
న్యూఢిల్లీ: దేశంలో నక్సలిజం ఇప్పుడు కొన ఊపిరితో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సో మవారం లోక్‌సభలో చెప్పారు. కేంద్రంలోని మో డీ ప్రభుత్వ సారధ్యంలో మావోయిస్టు తీవ్రవాదం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నక్సలిజం అంతానికి నిర్ధేశిత గడువు విధించుకుందని, ఈ మేరకు కార్యాచరణ పూర్తి అయిందని తెలిపారు. మావోయిస్టు హింసాత్మకతకు కేంద్ర బిందువు అయిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం ఇప్పుడు నక్సల్స్ విముక్తం అయిందని చెప్పిన అమిత్ షా ఈ దశలో కాంగ్రెస్ పాలకుల తీరుపై మండిపడ్డారు.
ఈ ఏడాది మార్చి 31 లోగా నక్సలిజం అంతం అని గతంలో కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. తరువాతి దశల్లో పలు స్థాయిలో పెద్ద ఎత్తున సరెండర్లు, భారీ ఎన్‌కౌంటర్ల ఘట్టాల తరువాత ఇప్పుడు నిర్ణీత డెడ్‌లైన్‌కు ఒక్కరోజు ముందు కేంద్ర హోం మంత్రి లోక్‌సభలో ప్రకటన వెలువరించారు. నక్సలిజం ని ర్మూలనలో ప్రభుత్వ ముందడుగును గురించి అ మిత్ షా ప్రస్తావించారు. బస్తర్ ఇప్పుడు వినూత్న రీతిలో బతుకుబాటలో సాగుతోందని, అభివృద్ధి పథంలో ముందుందని తెలిపారు. ఈ దిశలో సాధించిన విజయంలో ప్రతిష్ట అంతా కూడా భద్రతా బలగాలకు, స్థానిక పోలీసు బలగాలు, అక్కడి ఆదివాసీ తెగలకు చెందుతుందని స్పష్టం చేశారు.
మారుమూల ప్రాంతాల ప్రమేయం వారి సహకారం లేకుండా ఈ బృహత్తర లక్షం నెరవేరడం దుర్ల భం అయ్యేది అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పలు పునరావాస పథకాలను, సహాయక చర్యలను చేపట్టాయని.. క్రమంలోనే 4800కు పైగా నక్సల్స్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి చేరారని వెల్లడించారు. మూడేండ్లలో 706మంది నక్సల్స్‌ను మట్టుపెట్టారని, వీరిలో అగ్రశ్రేణి నక్సల్ నేతలు, పేరుమోసిన దళాల వారు ఉన్నారని గుర్తు చేశారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లోని అటవీశాఖా, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కూడా సరైన విధంగా స్పందించారని తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే కేవలం రెండు నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పునరావాస, సంక్షేమ చర్యలకు ప్రాధాన్యత ఇస్తూనే, మరో వైపు నక్సల్ కార్యకలాపాల ఆటకట్టుకు కటుతర చర్యలకు దిగిందని,ఈ ద్విముఖ వ్యూహం ఫలించిందని తెలిపారు.
కాంగ్రెస్ వైఖరితోనే నక్సలిజం సమస్య
1970లో ఇందిరా గాంధీ రాజకీయ ఎత్తుగడ దుష్పలితం.. దేశంలో నక్సలిజం సంస్కృతి పెరిగిపోయి, అటవీ ప్రాంతాలు ఆదివాసి కేంద్రాలు క్రమేపీ మావోయిస్టు కేంద్రీకృత హింసాత్మక చర్యలకు వేదికలు అయ్యాయని అమిత్ షా తెలిపారు. ఇందుకు కారణం ఆయా ప్రాంతాల్లో చిరకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరే అని విమర్శించారు. మారుమూల వెనుకబడ్డ ప్రాంతాలలో అభివృద్ధి ఫలాలు ఆయా ప్రాంతాల్లోని ఆదివాసీలకు చేరవేయడంలో కాంగ్రెస్ పాలకులు నిర్లక్షం వహించారు. పైగా దళారి వ్యవస్థను పోషించడం ద్వారా ఈ ప్రాంతంలో ఆదివాసీలు తరాలుగా వెనుకబడ్డారని,ఈ క్రమంలోనే నక్సలిజం వేళ్లూనుకుందని అమిత్ షా తెలిపారు.
తరువాతి క్రమంలో ఇది అదుపు తప్పి చివరికి తీవ్రస్థాయి హింసాత్మకతకు దారితీసిందన్నారు. నక్సలిజం అనేది అభివృద్ధి వాంఛతో తలెత్తలేదని , కేవలం వామపక్ష సిద్ధాంతాల భావజాలం వ్యాప్తితోనే జరిగిందని తెలిపారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాజకీయ స్వార్థం కోసం ఇతర పార్టీలను దెబ్బతీసేందుకు దేశంలో కొన్ని ప్రాంతాలలో కావాలనే వామపక్ష సిద్ధాంతాలను ప్రోత్సహించిందని తెలిపారు. కమ్యూనిజం కాదని, 1970 ప్రాంతంలో ఇందిరాగాంధీ ఏకంగా ఈ వామపక్ష తీవ్రవాద జాలాన్ని ఎంచుకున్నారు. అప్పటి రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసం ఈ ఎత్తుగడకు దిగారని, దీనితో పలు ప్రాంతాల్లో నక్సలిజం పుట్టకువచ్చిందని అమిత్ షా విశ్లేషించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రగతి ఫలాలను అందించలేదు. పైగా గిరిజన ప్రాంతాలను నిర్లక్షం చేశాయి. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాలను ఎంచుకుని వామపక్ష తీవ్రవాదం విస్తరించుకుందని, ఇన్నేళ్లకు మోడి ప్రభుత్వం ఈ జడల మర్రి ఊడలను దించిందని తెలిపారు. రేపటితో ఈ నక్సలిజం అంతం గడువు. నిర్ణీత లక్షం మేరకు దాదాపుగా సంపూర్తి అవుతుందన్నారు.
గద్దర్‌తో రాహుల్ చర్చలు దేనికి సంకేతం
దేశంలో నక్సలిజం అంతం ప్రకటన దశలో హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ నేత , ఎంపి రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ తన సొంత బాజా కోసం దేశ భద్రతకు సవాళ్ల సమస్యలపై కూడా నిర్లక్షం వహించారని తెలిపారు. లోక్‌సభలో తమ ప్రకటన దశలో అమిత్ షా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఈ యాత్రలో నక్సలైట్లకు చెందిన పలువురు వివాదాస్పద వ్యక్తులు , ప్రముఖులు వచ్చి ఆయనను కలిశారు. యాత్రలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణకు వెళ్లినప్పుడు రాహుల్ తన ప్రచార ఆర్బాటంలో భాగంగా గద్దర్, కొందరు అజ్ఞాత నేతలను కలుసుకునే వారని , దీనికి ప్రచారం కల్పించుకునేలా చేసుకున్నారని విమర్శించారు.
నక్సల్స్ అనుబంధ సంస్థలు, సంఘాలతో రాహుల్ పరిచయాలు, మిత్రత్వ ప్రదర్శనలు ఎటువంటి సంకేతాలకు దారితీస్తాయనేది ఆలోచించారా? అని ప్రశ్నించారు. సాయుధ ఉద్యమాల పిలుపులను సహించేది లేదని, వారికి వంతపాడే వారిని కూడా ఉపేక్షించేది లేదని అమిత్ షా హెచ్చరించారు. మిగిలిన నక్సల్స్ ఆయుధాలు వీడితేనే వారితో చర్చల ప్రసక్తి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ తన గొంతును లోక్‌సభలో అణచివేస్తున్నారనే వాదనను అమిత్ షా తోసిపుచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలకు సభలలో మాట్లాడేందుకు 157 గంటల సమయం ఇచ్చారు. ఇక ప్రతిపక్ష నేత రాహుల్‌ను మాట్లాడేందుకు పలుసార్లు అవకాశం కల్పించారు. అయితే ఆయనే దీనిని వాడుకోలేదు. పక్కదారితో సభల నుంచి వెళ్లిపోతూ వచ్చారని వ్యాఖ్యానించారు.