
మన తెలంగాణ/హైదరాబాద్‌ః లోక్‌సభ సీట్ల విషయంలో కేంద్రం చేపట్టనున్న డీ-లిమిటేషన్ ఫార్మూలా ఏదైనా ప్రస్తుతం దక్షిణ-ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న వ్యత్యాసమే భవిష్యత్తులో కూడా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం చేపట్టనున్న డీ-లిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు భారీగా నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ఒబిసి మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు.
తమ ఐదేళ్ళ పాలన గడువు ముగిసిన తర్వాత జమిలి ఎన్నికల నిర్వహించే సమయం వరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ డాక్టర్ లక్ష్మణ్ వితండవాదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించరా? అని ఆయన ప్రశ్నించారు. లక్ష్మణ్ ఎలా డాక్టర్ అయ్యారో, లెక్కలు రావేమో అర్థం కావడం లేదన్నారు. మీలో ఎవరికైనా లెక్కలు బాగా వస్తే డాక్టర్ లక్ష్మణ్‌కు చెప్పాలని ఆయన విలేకరులనుద్ధేశించి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల కోసం డాక్టర్ లక్ష్మణ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని అన్నారు. డీ-లిమిటేషన్‌పై బిజెపి నాయకులు అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. బ్రూటల్ మెజారిటీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. తిరుగులేని పాలన వస్తే నియంతృత్వం వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ పార్టీల సమస్య కాదు..
దేశవ్యాప్తంగా ఇప్పుడు 543 లోక్‌సభ సీట్లు ఉన్నాయని, అందులో సగం సీట్లు 272 పెంచాలని కేంద్రం భావిస్తున్నదని ఆయన చెప్పారు. దీంతో దేశ వ్యాప్తంగా 815 సీట్లు అవుతాయన్నారు. ఉదాహరణకు ఉత్తర్ ప్రదేశ్‌లో 80 సీట్లు ఉన్నాయని, డీ-లిమిటేషన్‌తో 120కి పెరుగుతాయని చెప్పారు. అదేవిధంగా తమిళనాడులో 40 ఉన్నాయని, డీ-లిమిటేషన్‌తో 60కి పెరుగుతాయని ఆయన తెలిపారు. ఉత్తరాదిలో ఇలా పెద్ద రాష్ట్రాలతో ఎక్కువ సీట్లు పెరుగుతాయన్నారు. పైగా దేశ వ్యాప్తంగా పెరిగే 272 సీట్లు మహిళా రిజర్వేషన్‌కు సరిపోతాయని అంటున్నారని ఆయన చెప్పారు. అయితే డీ-లిమిటేషన్ ఫార్ములా ఏదైనా ప్రస్తుతం దక్షిణాది-ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల వ్యత్యాసమే భవిష్యత్తులోనూ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు అంటే చిన్న చూపు ఉందని, భవిష్యత్తులో ఉత్తరాదిలో సీట్లు గణనీయంగా పెరిగితే, దక్షిణాదికి సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన తెలిపారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, ప్రజా సమస్య అని ఆయన అన్నారు. ఈ విషయంలో తాము దక్షిణాది రాష్ట్రాల పార్టీలను కలుపుకుని పోనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వస్తారని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.
కెసిఆర్ గృహ నిర్బంధంలో..
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ గురించి ప్రశ్నించగా, కెసిఆర్ విశ్రాంతి తీసుకోవడం లేదని, గృహ నిర్బంధంలో ఉన్నారని అనుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.