Reading Time: 2 minutes

హ్యామ్ విధానంలో వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభం

గ్రామీణ రోడ్లతో రైతులు, విద్యార్థులు, రోగులకు మెరుగైన సౌకర్యాలు

జాతీయ రహదారుల విస్తరణతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం

గేమ్ ఛేంజర్‌గా మారనున్న త్రిబుల్ ఆర్, గ్రీన్ ఫీల్ ఎక్స్‌ప్రెస్‌వే

అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే మూడు సంవత్సరాల్లో 70 వేల కోట్లతో రాష్ట్రంలోని రోడ్లను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి రోడ్లు భవనాలు శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, లక్ష్యాలు గురించి శాసన సభలో ప్రసంగించారు. మంచి రోడ్లు ఉంటే పెట్టుబడులు పెరిగి, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. రోడ్ల అభివృద్ధి ద్వారా మార్కెట్ సౌకర్యాలు మెరుగుపడి, పరిశ్రమలు విస్తరించి సమగ్ర ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధితో రైతులకు పంట మార్కెట్‌కు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని, విద్యార్థులు విద్య కోసం సులభంగా ప్రయాణిస్తారని, అత్యవసర పరిస్థితుల్లో రోగులు సమయానికి (గోల్డెన్ అవర్ లో) ఆసుపత్రులకు చేరుకోవచ్చని వివరించారు.

యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. మోర్త్ లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో, 1.6 లక్షల మంది మరణించారని తెలిపారు. రాష్ట్రంలో 22,441 ప్రమాదాలు జరిగి 6,221 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. డబ్బు పోతే తిరిగి వస్తుందని, ప్రాణం పోతే తిరిగి రాదని అన్నారు. రోజుకు సగటున 18 నుండి 20 మంది మరణించడం విచారకరమని, ఇందులో ఎక్కువగా యువతే ఉండటం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ఇటీవల చేవేళ్ల-, మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రోడ్డు అభివృద్ధి అనేది కేవలం మౌలిక వసతుల నిర్మాణం కాకుండా ప్రాణాలను కాపాడే బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో మొత్తం 34,062 కి.మీ రోడ్డు నెట్‌వర్క్ ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 7,590 కోట్లతో 1,835 కి. మీ రోడ్ల పనులు చేపట్టామని మంత్రి వెల్లడించారు. రూ. 13,051 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గత 27 నెలల్లో 595 కి.మీ రోడ్లు, 51 వంతెనలు పూర్తి (రూ. 1,035 కోట్లు) 323 కి.మీ రోడ్లు, 16 వంతెనలు (రూ. 485 కోట్లు) పూర్తయినట్లు వివరించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటి మోడల్) అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ విధానంతో 12,000 కి.మీ రోడ్ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఫేజ్-1లో 6,092 కి.మీ రోడ్లును సుమారు రూ. 13,006 కోట్ల వ్యయంతో 30 నెలల్లో నిర్మాణం, 15 సంవత్సరాల నిర్వహణ ఉంటుందని వివరించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (త్రిబుల్ ఆర్), హైదరాబాద్ నుంచి- విజయవాడ ఆరు లేన్ల విస్తరణ, అమరావతి నుంచి బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, బుల్లెట్ ట్రైన్ కారిడార్లు (చెన్నై, పూణే, బెంగళూర్) లాంటి నగరాలను కలుపుతూ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. బుల్లెట్ ట్రైన్స్ కోసం కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీలో శంషాబాద్ దగ్గరలో 500 ఎకరాలు ప్రభుత్వం కేటాయించనున్నట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయన్నారు.

వేగంగా కొనసాగుతున్న ఉస్మానియా, హైకోర్టు కొత్త భవనాల పనులు

రాష్ట్ర ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు రాష్ట్ర ఆర్‌అండ్‌బి శాఖ ఆధ్వర్యంలో పలు కీలక నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు మంత్రి తెలియజేశారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మణం జరుగుతోందని, కొత్త హైకోర్టు భవనాల నిర్మాణం ప్రస్తుతం పిల్లర్ల దశలో ఉండగా, పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. అదే విధంగా నగర అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని నాలుగు వైపులా అధునాతన ఆస్పత్రులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. మొత్తం రూ. 8,000 కోట్ల వ్యయంతో నాలుగు పెద్ద ఆస్పత్రులను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా సనత్ నగర్‌లో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రి దాదాపు రూ. 2,000 కోట్ల వ్యయంతో జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.