
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. కెసిఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులకు ప్రజలకు గుర్తింపు ఉండేది కాదన్నారు. రావణుని చెడు వల్లే శ్రీ రాముని గొప్పతనం తెలిసిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు.
మహాభారతంలో శకుని లేకపోతే శ్రీ కృష్ణునికి గుర్తింపు లేదన్నారు. అదేవిధంగా తనకూ కెసిఆర్ వల్లే ప్రజల్లో గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. కెసిఆర్‌ను, తనను ప్రజలు బేరీజు వేసుకుని తన వైపు మొగ్గు చూపారని ఆయన చెప్పారు. ఈ సమయంలో కెసిఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి టి. హరీష్ రావు ప్రస్తావన రావడంతో ఆయన నాగు పాము కంటే కూడా డేంజర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
నేడు కేరళ ఎన్నికల ప్రచారానికి
ఇదిలాఉండగా కేరళ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా నియమితులైన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం ప్రచారానికి వెళ్ళనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉంటానని ఆయన చెప్పారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికలు జరగనున్న మిగతా రాష్ట్రాల ప్రచారానికీ వెళతానని అన్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలోనూ డీ-లిమిటేషన్ ప్రచారాస్త్రంగా ముఖ్యమంత్రి ఉపయోగించనున్నారు. అదేవిధంగా సెస్‌పైనా ఆరోపణలు చేయనున్నారు. కేంద్రం సెస్ నిధులను తమకు ఇష్టమైన రాష్ట్రాలకే ఇచ్చుకుంటున్నదని ఆయన విమర్శించనున్నారు.
నవరసాలు ఉండాలి..
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పంటలకు ఉచిత విద్యుత్తు, తాజాగా సన్న బియ్యం వంటి పథకాల్లో వచ్చే ఎన్నికల నాటికి ఏదీ ప్రధాన అస్త్రంగా ఉంటుందని ప్రశ్నించగా, ఒక్కటేమిటీ నవరసాలు ఉంటాయని ఆయన ముక్తసరిగా సమాధానమిచ్చారు.