
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభం అదిరిపోయింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనే స్కోర్లు కొండల్లా పేరుకుపోయాయి. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏకంగా 200 పరుగుల పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది. ఇక రెండో మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఏకంగా 221 పరుగుల భారీ లక్ష్యాన్ని కళ్లు చెదిరే రీతిలో ఛేజ్ చేసి రికార్డు సృష్టించింది. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే, వారు చెన్నైని తక్కువ స్కోరుకే కట్టడి చేసినా, ఆ లక్ష్యాన్ని కేవలం 73 బంతుల్లోనే ఊదేసి తమ బ్యాటింగ్ పవర్‌ను చూపించారు.
రికార్డుల లెక్కలు
ఈ మూడు మ్యాచ్‌లను విశ్లేషిస్తే, ఐపీఎల్ పూర్తిగా బ్యాటర్ల వైపు మొగ్గు చూపుతోందా? అనే అనుమానం కలుగుతోంది. గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి. కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లోనే (3 మ్యాచ్‌లు) కలిపి 1103 పరుగులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 61 సిక్సర్లు బాదారు. అంటే సగటున ప్రతి మ్యాచ్‌కు 20 సిక్సర్లు నమోదవుతున్నాయి. ప్రతి మ్యాచ్‌లో సగటున 367 పరుగులు వస్తున్నాయి. ఈ జోరు చూస్తుంటే బౌలర్లకు ఈ సీజన్ గండంగా మారుతుందనిపిస్తోంది.
అసలు హీరోలు బౌలర్లే
విచిత్రం ఏమిటంటే.. బ్యాటర్లు ఇన్ని పరుగులు చేస్తున్నా, మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు మాత్రం బౌలర్లనే వరిస్తున్నాయి.
జాకబ్ డఫీ (RCB): న్యూజిలాండ్ పేసర్ డఫీ 3/22 గణాంకాలతో బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించి మొదటి అవార్డు అందుకున్నాడు.
శార్దూల్ ఠాకూర్ (MI): ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో 444 పరుగులు నమోదైనా, కీలకమైన 3 వికెట్లు తీసిన శార్దూల్ హీరోగా నిలిచాడు.
నాండ్రే బర్గర్ (RR): చెన్నైని తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో బర్గర్ (2/26) చూపిన తెగువకు అతనికి అవార్డు దక్కింది.
దీనిబట్టి బ్యాటర్లు స్కోర్లు చేసినా, మ్యాచ్ ఫలితాన్ని శాసించేది మాత్రం బౌలర్లేనని స్పష్టమవుతోంది.
వైభవ్ సూర్యవంశీ సెన్సేషన్
ఈ మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఆడిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవలం 15 ఏళ్ల వయసులోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాడు. అంధాధున్ బ్యాటింగ్‌తో చెన్నై బౌలర్లను చితక్కొట్టిన వైభవ్, ఈ సీజన్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా అవతరించాడు. ఇటు యంగ్ ప్లేయర్స్, అటు అనుభవజ్ఞులైన పేసర్ల కలయికతో ఐపీఎల్ 2026 రసవత్తరంగా సాగుతోంది.