
హైదరాబాద్, వెలుగు: రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పినట్లు కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. కాగ్ నివేదిక రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టులాంటిదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంక్షేమం, సాగునీటి రంగాలకు బడ్జెట్ పత్రాల్లో భారీ నిధులు పెట్టినా, ఖర్చు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ తప్పుపట్టిందన్నారు.
కాంగ్రెస్ పాలనతో పాటు బడ్జెట్లు కూడా డొల్లగా మారాయని రిపోర్ట్ తేల్చి చెప్పిందన్నారు. కరోనా టైం మినహాయిస్తే ఇంత పెద్ద రెవెన్యూ లోటు ఎప్పుడూ లేదని, ప్రస్తుతం కరోనా గానీ, పెద్ద నోట్ల రద్దుగానీ లేదని, రెవెన్యూ లోటు మైనస్ రూ.9,420 కోట్లకు ఎందుకు పోయిందని ప్రశ్నించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెరిగినా, రెవెన్యూ రిసీట్స్ తగ్గడం ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, విధానాల ఫలితమేనన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ మైక్ దొరికితే అక్కడ 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుగా చేస్తామని చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 1 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.93 లక్షల కోట్లు అని, 3 ట్రిలియన్ డాలర్లు అంటే రూ.280 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. ఇది సాధ్యపడాలంటే వచ్చే ఎనిమిదేళ్ల పాటు ప్రతి ఏటా 20.7 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చొప్పున వృద్ధి సాధించాల్సి ఉంటుందని చెప్పారు. ఇది ఎకనామిక్ విజన్ కాదని, ట్రిలియన్ డాలర్లు అంటూ మభ్యపెట్టే పొలిటికల్ ప్రాపగాండా అని విమర్శించారు. ఇకనైనా ఇలాంటి ప్రకటనలు నిలిపేయాలని డిమాండ్ చేశారు.