Reading Time: < 1 minute

నేడు గుజరాత్‌తో పంజాబ్ ఢీ

ముల్లాన్‌పుర్: ఐపిఎల్‌లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. న్యూ చండీగఢ్‌లోని మహరాజా యదవింద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. దీంతో రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమయ్యాయి. పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహిస్తున్నారు. పంజాబ్ కిందటి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి ట్రోఫీ సాధించడమే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది.

ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, శశాంక్ సింగ్, స్టోయినిస్, సూర్యాన్ష్, ముషీర్ ఖాన్, నెహాల్ వధెరా వంటి స్టార్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఈ సీజన్‌లో శ్రేయస్ జట్టుకు కీలకంగా మారాడు. టీమ్‌ను ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన శ్రేయస్ చెలరేగితే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఇబ్బందులు ఖాయం. ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్, శశాంక్‌లు కూడా కిందటి సీజన్‌లో మెరుపులు మెరిపించారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక చాహల్, ఫెర్గూసన్, మార్కొ జాన్సన్, అర్స్‌దీప్ సింగ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది.

ఇక గుజరాత్‌లోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు కీలకంగా మారారు. కిందటి సీజన్‌లో గిల్, సాయి సుదర్శన్‌లు పలు మ్యాచుల్లో జట్టుకు శుభారంభం అందించారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నారు. జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, షారూక్ ఖాన్, అనూజ్ రావత్, తెవాటియా తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక రషీద్ ఖాన్, హోల్డర్, వాషింగ్టరన్, టామ్ బాంటమ్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. సిరాజ్, రబడా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.