
హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ నియామక బోర్డు విడుదల చేసింది. గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో మొత్తం 174 పోస్టుల భర్తీకి ఈ జాబితా వెల్లడించినట్లు బోర్డు పేర్కొంది. తాజా జాబితాలో ఎంపికైన అభ్యర్ధులకు ఏప్రిల్ 1న హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని బోర్డు వెల్లడించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తామని బోర్డు పేర్కొంది. కాగా మొత్తం పోస్టుల్లో గైనకాలజీలో 90 పోస్టులు, అనస్తీషియాలో 44 పోస్టులు, పీడియాట్రిక్స్‌లో 28 పోస్టులు, ఆర్థోపెడిక్స్‌లో 12 పోస్టులు ఉన్నాయి. తుది ఫలితాలు ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారు.
ఏప్రిల్ 9న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది సెలక్షన్ లిస్ట్ విడుదల
సర్కారు దవాఖానాల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీపై మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక అప్‌డేట్ జారీ చేసింది. 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్‌ను ఏప్రిల్ 9వ తేదీన విడుదల చేయనున్నట్టు నియామక బోర్డు మరో ప్రకటనలో వెల్లడించింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సహా ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్టు ఇటీవలే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌ను వచ్చే నెల 9న విడుదల చేయనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.