Reading Time: < 1 minute
TG Inter 2026 Result Date: ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి.. ఏప్రిల్‌ రెండో వారంలో ఫలితాలు విడుదల! ఏ తేదీనంటే..

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారం (మార్చి 30)తో ముగిసింది. . రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూల్యాంకనం ముగియడంతో ఫలితాల క్రోడీకరణ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు చకచకా ఏర్పాట్లు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 8, 10, 12 తేదీల్లో ఏదో ఒక రోజున ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆయా తేదీల్లో ఫలితాల వెల్లడికి ప్రభుత్వ అనుమతి కోరారు. నిజానికి, తొలుత ఏప్రిల్ 6న ఫలితాలు విడుదల చేయాలనుకున్నప్పటికీ బడ్జెట్ సమావేశాలు ఇతర పనులతో రెండో వారానికి వాయిదావేశారు.

మరోవైపు ఇంటర్‌ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌కు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితాల ప్రకటనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఈమేరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సింగిల్‌ సబ్జెక్టు ఫెయిలైన వారితోపాటు ఒక్కో సబ్జెక్టులో కొన్ని జవాబుపత్రాలను ర్యాండమ్‌గా రీ-వెరిఫికేషన్‌ చేయించనున్నారు. ఆ తర్వాత సీజీజీలో ట్రయల్స్‌ నిర్వహించి అంతా సవ్యంగా ఉంటేనే ఫలితాలు విడుదల చేస్తారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌ సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జూన్‌ 1 నుంచే ఇంటర్‌ తరగతులు ప్రారంభం

ఇక ఇంటర్మీడియట్‌ 2026-27 విద్యాసంవత్సరం జూన్‌ 1 నుంచి ప్రారంభంకానుంది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలకు మొత్తం 224 పనిదినాలు ఉండనున్నాయి. ఈ మేరకు కొత్త వార్షిక విద్యా క్యాలెండర్‌ (అకాడమిక్‌ క్యాలెండర్‌)ను సోమవారం విడుదల చేసింది. వేసవి సెలవుల అనంతరం జూనియర్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 1న పునఃప్రారంభమవుతాయని, అదే రోజు నుంచి ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు 2027 ఫిబ్రవరి చివరి వారంలో మొదలవుతాయని కృష్ణ ఆదిత్య వెల్లడించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.