
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో.. ఆయనంత వేగంగా తాను రంగులు మార్చలేనందుకు! గోబెల్స్ బతికుండి ఉంటే, తలదించుకునేవాడేమో.. ట్రంప్‌లా తాను అలవోకగా అబద్ధాలు చెప్పలేకపోయినందుకు! అభూత కల్పనలను అసలు సిసలైన వాస్తవాలుగా నమ్మబలకడంలో ట్రంప్‌ను మించినవారు వర్తమాన కాలంలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. గతంలో ఆయన ఆడిన అబద్ధాలను అలా ఉంచి, ప్రస్తుతం ఇరాన్‌తో సాగిస్తున్న యుద్ధం విషయాన్నే చూసుకుంటే అమెరికా అధినేత ఆడిన అబద్ధాలను చూసి ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. గత జూన్‌లో ఇరాన్‌పై అమెరికా దాడులు జరిపినప్పుడు ఇకపై ఇరాన్ అణు కార్యక్రమానికి పాల్పడటానికి వీల్లేనంతగా దెబ్బతీశామని ట్రంప్ స్వయంగా ప్రకటించుకున్నారు. అదే నిజమైతే, ఇక ఈ తాజా దాడులు ఎందుకనేది ప్రశ్న.
పది రోజుల క్రితం కూడా ఆయన ఇదే తరహాలో అబద్ధాన్ని అందంగా వల్లె వేశారు. ఇరాన్ ను కోలుకోలేనంతగా దెబ్బతీశామని, ఇక యుద్ధం ఎన్నో రోజులు కొనసాగదని అన్నారు. కానీ, వాస్తవంలో జరుగుతున్నది వేరు. యుద్ధం మొదలై మూడు వారాలు దాటినా ఇరాన్ తగ్గలేదు సరికదా, దీర్ఘశ్రేణి క్షిపణులను సైతం ప్రయోగిస్తూ, అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యుద్ధం ప్రారంభమైన రెండు రోజులకే ఇరాన్ లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 175మందికి పైగా పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఈ దాడి జరిపింది ఇరానేనంటూ ట్రంప్ నమ్మబలికేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, అమెరికా క్షిపణి పొరబాటున పాఠశాలను తాకడమే ఈ ప్రమాదానికి కారణమంటూ ఆ దేశ రక్షణ శాఖ జరిపిన దర్యాప్తులో తేలడంతో ట్రంప్ తన నోటికి తాళం వేసుకోవలసి వచ్చింది.
ఇరాన్‌తో చర్చలు జరుపుతున్న కారణంగా, దాడులను వారం రోజులపాటు నిలిపివేస్తున్నట్లు తాజాగా ట్రంప్ మరో అబద్ధాన్ని వండివార్చారు. కానీ, ఈ వాదనను ఇరాన్ కొట్టిపారేసింది. తాము అమెరికాతో చర్చలు జరవడం లేదంటూ తేల్చిచెప్పింది. తాను ఒక అగ్రరాజ్యానికి అధినేతననీ, తన మాటలు, చేతలూ దేశప్రతిష్ఠను ఇనుమడింపజేసే విధంగా ఉండాలే తప్ప, దిగజార్చకూడదన్న ఇంగితాన్ని విస్మరించి నిస్సిగ్గుగా అసత్యాలను, అర్ధసత్యాలను పలికే దేశాధినేతల జాబితాను ఎవరైనా తయారు చేస్తే, అందులో అగ్రస్థానం ట్రంప్‌దే కావచ్చుననడంలో సందేహం లేదు. మొదటిసారి అమెరికా అధ్యక్ష పదవిని వెలగబెట్టినప్పుడు ఆయన సగటున రోజుకు ఎనిమిది అబద్ధాలు ఆడేవారని సిఎన్‌ఎన్ జరిపిన ఒక సర్వేలో తేలడం విశేషం. రాజకీయ జీవితం గురించే కాదు, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా గతంలో ఆయన ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాల గురించి, ఒక మోడల్‌తో వెలగబెట్టిన ప్రేమాయణం గురించి ఆయన చెప్పినవి అవాస్తవాలని రుజువైనా, తప్పు సరిదిద్దుకోకుండా, రెట్టించిన ఉత్సాహంతో అబద్ధాలాడుతూ ఉండటం ఆయనకే చెల్లు. ఇరాన్‌తో యుద్ధం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ ట్రంప్ దారుణంగా విఫలమయ్యారు.
హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేస్తుందని, గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభిస్తుందని అంచనా వేయడంలో ట్రంప్ అండ్ కో బొక్కబోర్లాపడ్డారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను తాను ఊహించలేదని స్వయంగా అంగీకరించడం ఆయన వైఫల్యానికి నిదర్శనం. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ విద్యుత్కేంద్రాలపై దాడులు జరుపుతామన్న ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ లొంగలేదు సరికదా, అదే జరిగితే పశ్చిమాసియా వ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, ఇంధన వసతులను నాశనం చేస్తామని హెచ్చరించింది. దీంతో ట్రంప్ తోకముడిచారు. నాటో దేశాలను కలుపుకుపోవాలన్న ఆయన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. ఇరాన్ తో యుద్ధం కారణంగా అమెరికాకు జరిగిన నష్టం కూడా తక్కువేమీ కాదు. ఇప్పటివరకూ పన్నెండుమంది సైనికులు కన్నుమూయగా, వందమందికి పైగా క్షతగాత్రులయ్యారు. గల్ఫ్ దేశాల్లోని పలు అమెరికన్ స్థావరాలు ధ్వంసమయ్యాయి.
అమెరికా వైమానిక దళానికి వెన్నుదన్నుగా నిలిచే ఎఫ్-35 వంటి యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడం మరో ఊహించని దెబ్బ. యుద్ధం కారణంగా అమెరికాలోనూ పెట్రోలు, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. తాను అధికారంలోకి రావడానికి ముందు, ‘నిరంతరం యుద్ధాలలో మునిగితేలుతున్నారు’ అంటూ డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ట్రంప్ ఇప్పుడు చేస్తున్నదేమిటి? ప్రపంచదేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం ద్వారా తాను బావుకున్నదేమిటి? ఇంటాబయటా కావలసినంత అప్రదిష్ట మూటగట్టుకున్న ట్రంప్ మహాశయులు ఇక చేయవలసింది ఒక్కటే. దౌత్యమార్గాల ద్వారా ఇరాన్‌తో చర్చలకు ఉపక్రమించడం. భారత ప్రధాని అన్నట్లుగా పశ్చిమాసియా సంక్షోభానికి చర్చలే పరిష్కారాన్ని చూపాలి. అందుకు భారత్ వంటి తటస్థ దేశాలు నడుం బిగించడం అభిలషణీయం.