
ఎన్నో ఆశలతో కొడుకును పెంచాడు.. అయితే.. ఆ కొడుకే.. ఆ తండ్రి పాలిట యముడిలా మారాడు.. ఇల్లు కోసం కన్న తండ్రిని దారుణంగా హతమార్చాడు.. ఈ ఘటన గతేడాది విజయనగరంలో సంచలనంగా మారింది.. ఈ కేసులో న్యాయమూర్తి కీలక తీర్పును వెలువరించారు. కన్న తండ్రిని కిరాతకంగా హత్యచేసిన కొడుకుకు జీవితఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువరించారు జిల్లా న్యాయమూర్తి ఎం. బబిత. విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 2025 సంవత్సరంలో చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. పట్టణంలోని గాజులరేగకు చెందిన కర్నపు సాయి (20) తన తండ్రితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. కొంతకాలంగా తన తండ్రి పేరుపై ఉన్న ఇల్లును తనకు రాసివ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అయితే తండ్రి అందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025 ఫిబ్రవరి 13వ తేదీ రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన సాయి, తన తండ్రితో మళ్లీ ఘర్షణకు దిగాడు. కోపావేశంలో చేతులతో గుండెలపై బలంగా కొట్టడంతో పాటు కాళ్లతో తన్నడంతో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో వాస్తవాలు బయటపడడంతో కేసును హత్యగా మార్పు చేసి నిందితుడు సాయిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి, న్యాయస్థానంలో బలమైన ఆధారాలు సమర్పించారు. కేసు విచారణలో నిందితుడిపై నేరం రుజువుకావడంతో విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జి శ్రీమతి ఎం. బబిత, నిందితుడు కర్నపు సాయికి జీవిత ఖైదుతో పాటు రెండు వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ మాట్లాడుతూ కేసు త్వరితగతిన పరిష్కారానికి కృషి చేసిన పోలీసు, న్యాయ శాఖ అధికారులను అభినందించారు. కుటుంబ విభేదాలు తీవ్ర రూపం దాల్చినప్పుడు ఎలా విషాదాంతానికి దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..