
రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి యూరియా నిల్వలు తగినంతగా ఉన్నాయని, వ్యవసాయానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పరిస్థితులు అనూహ్యంగా ఉంటున్నాయి. మార్చి 10 నాటికి భారత్‌లో యూరియా నిల్వలు 61.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయని, అంటే గత ఏడాది ఇదే సమయంలో ఉండే నిల్వల కన్నా 10 లక్షల టన్నుల వరకు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ వాణిజ్యాన్ని అల్లకల్లోలం చేస్తోం ది. ఈ సంక్షోభం వ్యవసాయానికి ప్రధాన అవసరమైన యూరియా తయారీకి కావలసిన లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ద్రవీకృత సహజవాయువుఎల్‌ఎన్‌జి) సరపరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యుద్ధం ప్రకంపనలు ఇప్పటికే భారత్ యూరియా సరఫరాను దెబ్బతీస్తున్నాయి. ఆదివారం (మార్చి 22) నాటికి భారత్ లోని యూరియా ప్లాంట్లు సగం సామర్థంతో నడుస్తున్న పరిస్థితి ఏర్పడింది. కొన్ని యూరియా కంపెనీలు ప్లాంట్లను మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయి.
భారత్ అతిపెద్ద ఎల్‌ఎన్‌జి దిగుమతిదారైన పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి సంస్థ ఖతార్ నుండి దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా గ్యాస్ సరఫరాను నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. ఇటీవల ఖతార్‌లోని రాస్‌లాఫాన్‌లో యుద్ధంవల్ల గ్యాస్ సరఫరా వ్యవస్థకు నష్టం జరగడంతో ఒప్పందం ప్రకారం సరఫరా చేయలేనని పెట్రోనెట్ చేతులుఎత్తేసింది. ఈ చర్య కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం లోని గెయిల్ (ఇండియా), ఇండియా ఆయిల్ కార్పొరేషన్ సంస్థ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి గ్యాస్ పంపిణీదారుల ద్వారా సరఫరా కోతకు దారి తీసింది. ఎల్‌ఎన్‌జి సరఫరా కోసం భారత్ భారీగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. భారత్ రోజూ 4.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును, అంటే తన అవసరాల్లో 88%, అలాగే 47% సహజవాయు డిమాండ్ కోసం ద్రవీకృత సహజవాయువును విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్‌లో యూరియా ధరలు పెరగడమే కాకుండా ఎరువులపై భారత ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలపై కూడా ప్రభావంపడే అవకాశం కనిపిస్తోంది. యూరియా కొరతవల్ల వ్యవసాయ ఉత్పాదక ఖర్చులు పెరగడమే కాకుండా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. 2025లో అంతర్జాతీయ మార్కెట్ నుంచి 50% పైగా సహజవాయువు (ఎల్‌ఎన్‌జి)ను భారత్ దిగుమతి చేసుకుంది.
ప్రపంచం మొత్తంమీద భారీస్థాయిలో ఎల్‌ఎన్‌జి నాలుగో కొనుగోలుదారు భారత్‌యే. 2025లో 261 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జిని భారత్ దిగుమతి చేసుకుంది. ఇందులో 40% ఖతార్ నుంచి మిగతా 20% యుఎఇ, ఒమన్ ద్వారా సరఫరా అవుతుంది. ఈ ఎల్‌ఎన్‌జి అంతా హోర్ముజ్ జలసంధి ద్వారానే నౌకల మీదుగా రవాణా అవుతుంది. మొత్తం మీద భారత్ దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జి 60% వరకు హోర్ముజ్ జలసంధి మూసివేయడంవల్ల అంతరాయం ఏర్పడుతోంది. భారత్‌లో అమోనియా తయారీకి తద్వారా ఎరువుల తయారీకి ప్రధానంగా సహజవాయువునే వినియోగిస్తుంటారు. 2026లో భారత్‌కు సరఫరా అయిన ఎల్‌ఎన్‌జిలో 30% ఎరువుల తయారీకే వినియోగం కావడం గమనార్హం. యూరియా ఉత్పత్తికి ఎల్‌ఎన్‌జి ప్రధాన వనరు. దేశంలో ఎరువులుగా యూరియానే ఎక్కువగా వాడుతుంటారు. యూరియా ఉత్పత్తి అత్యంత ఇంధన వినియోగతో కూడిన ప్రక్రియ.
ఈ యూరియా ప్లాంట్లు తక్కువ ఉద్గారాలను విడుదల చేసే సహజవాయువు వినియోగంలోకి మారాయి. జాతీయ స్థాయిలో యూరియా వినియోగం గత దశాబ్దకాలంలో క్రమంగా పెరిగి 2025లో 387 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 2025లో స్వదేశీ యూరియా ఉత్పత్తి కూడా దాదాపు 306 లక్షల మెట్రిక్ టన్నుల వరకు జరిగినా దేశం మొత్తం మీద డిమాండ్‌ను నెరవేర్చలేకపోతోంది. అందువల్ల భారత్ యూరియా దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం స్వదేశీ యూరియా ఉత్పత్తిని, సరఫరాను దెబ్బతీస్తోంది.2025లో భారత్ యూరియా దిగుమతులు 2300 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయి. ఈ దిగుమతుల్లో 71% పశ్చిమాసియా నుంచి రావలసి ఉండగా, ఇందులో 45% ఒమన్, సౌదీఅరేబియా, ఖతార్, యుఎఇ నుంచి సరఫరా అవుతుంటాయి. ఈ మొత్తం సరఫరా హోర్ముజ్ జలసంధిద్వారా రవాణా కావలసి ఉంది.
ఈ నేపథ్యంలో సహజవాయువు సరఫరా నియంత్రణ ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో ఎరువుల రంగాన్ని ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. రెండు మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పుడు కూడా ఇంధనం, ఎరువుల సరఫరా విషయంలో కూడా భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఎరువుల తయారీకి ప్రాధాన్యం ఇచ్చి స్వదేశీయంగా సబ్సిడీ ధరకు గ్యాస్ లభిస్తేనే ఎరువులు ఉత్పత్తి అవుతాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా పొటాష్ సరఫరా దెబ్బతింది. ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే యూరియాలో 14% ఒక్క రష్యా నుంచే సరఫరా అవుతోంది. డిఎపిలో రష్యా సరఫరా దాదాపు 10% వాటాతో రెండో ఉత్పత్తిదారుగా రష్యా ఉంటోం ది. పొటాష్‌లో కావలసినవి 50% రష్యా, బెలారస్ నుంచే రప్పించుకోక తప్పదు. భారత్ డిఎపి డిమాండ్‌లో దాదాపు 60% చైనా, సౌదీఅరేబియా నుంచే లభిస్తోంది. ఇప్పుడు సౌదీఅరేబియా కూడా యుద్ధ బాధిత దేశంగా ఉండడంతో డిఎపి సరఫరా దెబ్బతింటోంది. భారతదేశానికి సరఫరాలో ఇబ్బందులే కాకుండా దిగుమతుల వ్యయం బిల్లుకూడా అమాంతంగా పెరిగే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని వాణిజ్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.