Reading Time: 4 minutes

2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఇప్పటికీ ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గట్టిగానే కనిపిస్తోంది. అయితే అది కేవలం గతం జ్ఞాపకంగా నిలిచిపోలేదు; 2026 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అది మారుతూ, మరింత స్పష్టమైన సూచనగా కనిపిస్తోంది. ఒకప్పుడు అనేక పార్టీల మధ్య జరిగిన పోటీ, గత దశాబ్దంలో క్రమంగా కుదించుకుపోయి, ఇప్పుడు ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య ద్వైపాక్షిక పోరాటంగా మారింది. ఇదే సమయంలో వామపక్షాలు తమ రాజకీయ ప్రాధాన్యాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వాటి విజయాలు పరిమితంగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఎవరు ముందుంటారు అనేది మాత్రమే కాదు; 2021లో ఏర్పడిన రాజకీయ సమతుల్యత స్థిరమా లేక సున్నితమైనదా అనేదే కీలకం.

2021 ఎన్నికల ఫలితం చూస్తే అది స్పష్టమైన విజయం. మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి మూడింట రెండు వంతుకుపైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని, దాదాపు సగం ఓట్లను సంపాదించింది. అయితే ఆ విజయంలో ఒక ముఖ్యమైన మార్పు కూడా దాగి ఉంది. బిజెపి అట్టడుగు స్థాయినుంచి ఎదిగి, ఒక బలమైన ప్రతిపక్షంగా మారింది. దాదాపు ఐదో వంతులో రెండో వంతు ఓట్లను సంపాదించి, వామపక్ష, కాంగ్రెస్ కూటమిని పక్కకు నెట్టింది. ఈ మార్పు ప్రాధాన్యం చాలా గొప్పది. ఎన్నాళ్లుగా సిద్ధాంతపరమైన పోటీలు, వర్గాల పొత్తు రాజకీయాలతో సాగిన బెంగాల్ రాజకీయాలు, ఇప్పుడు రెండు వేర్వేరు రాజకీయ విధానాలను ప్రతిబింబించే పార్టీల మధ్య నేరుగా, స్పష్టమైన పోటీగా మారాయి. ఒకటి ప్రాంతీయ ఆధిపత్యం, సంక్షేమ కార్యక్రమాలపై ఆధారపడితే, మరొకటి జాతీయ ఏకీకరణ, గుర్తింపు రాజకీయాలపై దృష్టి పెట్టింది.

ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా, టిఎంసి ఆధిపత్యం ఎంతకాలం నిలబడుతుందన్నది. ‘కొనసాగింపు, అలసట’ అనే రెండు అంశాల మధ్య జరుగుతున్న సంక్లిష్ట సమతుల్యతపై ఆధారపడి ఉంది. పార్టీకి ఉన్న ప్రధాన బలం దాని బలమైన సంస్థాగత వ్యవస్థ, అలాగే సంక్షేమ పథకాల ద్వారా ఓటర్ల విశ్వాసాన్ని సంపాదించే సామర్థ్యం. మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలను లక్ష్యంగా పెట్టుకున్న పథకాలు, స్థిరమైన సామాజిక మద్దతును ఏర్పరచాయి. ఇప్పటివరకు ఈ మద్దతు, ప్రభుత్వ వ్యతిరేక భావన, తీవ్రమైన రాజకీయ ప్రచారాలను కూడా తట్టుకుని నిలిచింది. అంతేకాదు, మమతా బెనర్జీ వ్యక్తిగత ప్రజాదరణ కూడా పార్టీకి కీలక బలం. ఆమె నాయకత్వం పార్టీ కథనాన్ని బలపరచడమే కాకుండా, అంతర్గత విభజనలను తగ్గించడంలో సహాయపడుతోంది.

అయితే, అధికారంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల అసంతృప్తి సహజంగానే పెరుగుతుంది. అవినీతి ఆరోపణలు, పార్టీలో వర్గపోరాటాలు, స్థానిక స్థాయిలో కార్యకర్తలలో ఉన్న అసహనం– ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేక భావనకు దారితీశాయి. ఇవి తాత్కాలిక సమస్యలుగా కొట్టిపారేయలేనివి. ఈ బలహీనతలను టిఎంసి నాయకత్వం గుర్తించినట్లే కనిపిస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేయడం, కొత్త తరాన్ని ముందుకు తీసుకురావడం వంటి చర్యలను చేపడుతోంది. అయితే ఇవి ఎంతవరకు ప్రభుత్వ వ్యతిరేక భావనను తగ్గిస్తాయన్నది కీలక అంశంగా మారనుంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ ప్రదర్శన, దాని స్థిరత్వాన్ని సూచించినప్పటికీ, అత్యంత కీలకమైన అసెంబ్లీ పోటీలో పార్టీ పట్టు కోల్పోయే అవకాశాన్ని ఇవి పూర్తి తొలగించలేవు.

బిజెపికి ఎదురయ్యే సవాలు భిన్నమైనది. బెంగాల్‌లో పార్టీ విస్తరణ ఇప్పటికే రాష్ట్ర రాజకీయ సమీకరణలను మార్చేసింది. అయితే 2021 తర్వాత దాని ప్రస్థానం, పురోగతి కంటే ఎక్కువగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికే పరిమితమైంది. ఉత్తర బెంగాల్ ప్రాంతాల్లో, అలాగే గుర్తింపు రాజకీయాలు, పాలనపై పార్టీ ఇచ్చిన సందేశాలకు స్పందించిన వర్గాల్లో బిజెపికి గట్టి ఓటు బ్యాంక్ ఉంది. అయినప్పటికీ, ఓట్ల వాటాకు, సీట్ల మార్పిడికి మధ్య ఉన్న అంతరం ఒక కీలకమైన అడ్డంకిగా మిగిలిపోయింది. ‘ఫస్ట్ -పాస్ట్ -ది- పోస్ట్’ విధానం సంస్థాగత బలహీనతలను మరింత స్పష్టంగా బయటపెడుతోంది. ఈ విషయంలో బిజెపి, టిఎంసిలో పాతుకుపోయిన క్షేత్రస్థాయి యంత్రాంగం కంటే వెనుకబడి ఉంది.

బిజెపి ఎదుగుదలకు మరో ముఖ్యమైన అడ్డంకి నాయకత్వ సమస్య. జాతీయ స్థాయి నాయకులు పార్టీకి గుర్తింపు, ఉత్సాహం తీసుకువచ్చినా, మమతా బెనర్జీకి సమానంగా రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపగల నాయకుడు లేకపోవడం పార్టీకి పెద్దలోటుగా మారింది. బెంగాల్ రాజకీయాల్లో ఎప్పటినుంచో ప్రాంతీయ భావజాలం, వ్యక్తిగత నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అయితే బిజెపి ప్రధానంగా కేంద్రస్థాయి కథనాలపై ఆధారపడటం వల్ల, అవి స్థానిక స్థాయిలో పూర్తిగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ లోటును పూడ్చాలంటే, పార్టీకి కేవలం ఓట్ల శాతం పెరగడమే కాకుండా, మరింత సమర్థవంతమైన సంస్థాగత నిర్మాణం, స్పష్టమైన రాష్ట్రస్థాయి నాయకత్వ వ్యూహం అవసరం.

ఇక వామపక్షాల పరిస్థితి చూస్తే, అది చారిత్రక పతనాన్నీ, తాత్కాలిక పట్టుదలనూ ప్రతిబింబిస్తోంది. మూడు దశాబ్దాలపాటు ఏకపక్ష ఆధిపత్యం చూపిన వామపక్షాలు, ఇప్పుడు శాసనసభలో దాదాపు కనిపించని స్థితికి చేరాయి. 2021లో వారి సంప్రదాయ మద్దతుదారులు బిజెపి వైపు మళ్లడం, బిజెపి సిద్ధాంతానికి మద్దతు పలకడం కంటే, టిఎంసిని ఓడించాలనే వ్యూహాత్మక నిర్ణయాన్ని ఎక్కువగా భావించాలి. అయితే ఈ విధమైన వ్యూహాత్మక ఓటింగ్ వల్ల ప్రస్తుతం రాజకీయాలు రెండు పార్టీల మధ్యే కేంద్రీకృతమయ్యే పరిస్థితి మరింత బలపడింది. ఇదే పరిస్థితి వామపక్షాల పునరుద్ధరణకు అడ్డంకిగా మారుతోంది.

అయినప్పటికీ, వామపక్షాల ఉనికి కొంతమేర మిగిలి ఉంది అనేందుకు ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతలో, అలాగే పట్టణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో కొంత మద్దతు కనిపిస్తోంది. చిన్న పోటీల్లో ఓట్ల శాతం క్రమంగా పెరగడం, పడిపోతున్న స్థితి కొంతవరకు స్థిరపడిందని సూచిస్తున్నప్పటికీ, దాని పునరుజ్జీవనానికి ఉన్న నిర్మాణాత్మక అడ్డంకులు మాత్రం చాలా బలంగా ఉన్నాయి. తీవ్రంగా విభజన చెందిన రాజకీయాల్లో, గెలిచే అవకాశాలు లేవని భావించే మూడో పార్టీకి ఓటేయడానికి ప్రజలు సాధారణంగా ముందుకురారు. బలమైన నాయకత్వం లేదా కొత్త రాజకీయ దిశ లేకపోతే, వామపక్షాలు అధికారానికి కాకుండా, కేవలం తమ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకోవడానికే పరిమితమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

రాబోయే ఎన్నికలను మరింత అనిశ్చితంగా మారుస్తోన్న ప్రధాన అంశం స్వల్ప తేడాతో నిర్ణయించబడే నియోజకవర్గాల ప్రాధాన్యం. 2021లో గణనీయమైన సంఖ్యలో స్థానాలు చాలా తక్కువ ఓట్ల తేడాతోనే నిర్ణయించబడ్డాయి. అంటే, ఓటర్ల ప్రాధాన్యతల్లో చిన్న మార్పు వచ్చినా, సీట్ల ఫలితాల్లో అసమానమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఒకవైపు రెండు పార్టీల మధ్య స్థిరమైన పోటీ ఉన్నప్పటికీ, మరోవైపు అనిశ్చితిని కూడా పెంచుతోంది. ప్రాంతాల వారీగా చూస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా కనిపిస్తోంది. బెంగాల్ ఉత్తర జిల్లాల్లో బిజెపికి బలమైన స్థానం ఏర్పడగా, దక్షిణ ప్రాంతాల్లో టిఎంసి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ భౌగోళిక విభజనను రెండు పార్టీలూ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయనున్నాయి.

మరింత లోతుగా చూస్తే, ఈ పోటీ పరిపాలన, సంక్షేమం అనే పరస్పర విరుద్ధమైన కథనాల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. టిఎంసి లక్ష్యంగా పెట్టుకున్న సామాజిక సంక్షేమ పథకాలు, స్థానికంగా వాటి అమలు విధానంపై దృష్టిపెట్టగా, బిజెపి అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం, జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానం వంటి విస్తృత అంశాలను ముందుకు తీసుకురానుంది. ఓటర్లు తక్షణ ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారా లేక దీర్ఘకాల పాలనా హామీలను విశ్వసిస్తారా అన్నది ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారనుంది. అలాగే, గుర్తింపు రాజకీయాలు, సాధారణ ఆర్థిక సమస్యలకు మధ్య ఉండే పరస్పర ప్రభావం కూడా రెండు పార్టీల వ్యూహాలను పరీక్షించబోతోంది.

అయితే, ఈ ఎన్నికలను కేవలం పార్టీల మధ్య పోటీగా మాత్రమే చూడటం సరళీకృత దృక్పథంగా మారుతుంది. బెంగాల్ ఓటర్లు వ్యూహాత్మకంగా ఓటు వేయగల సామర్థ్యం, ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని గతంలోనే నిరూపితమైంది. అప్పట్లో ప్రచార ఉత్సాహం, మీడియా కథనాలు, సంస్థాగత విస్తరణ.. అన్నీ ఉన్నప్పటికీ అవి వాటంతట అవే ఎన్నికల విజయంగా మారవని 2021 ఫలితం ఉదాహరణగా నిలిచింది. స్థానిక అభిప్రాయాలు, నాయకత్వంపై విశ్వాసంతో సరిపోలకపోతే అవి విజయంలోకి మారవని స్పష్టమైంది. అదే సమయంలో, బలంగా స్థిరపడిన ఆధిపత్యం కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేయకపోతే క్రమంగా క్షీణించే ప్రమాదం ఉంది.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, టిఎంసి తన బలమైన సంస్థాగత నిర్మాణం, నాయకత్వానికి ఉన్న ప్రజాదరణ కారణంగా స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. బిజెపి మాత్రమే విశ్వసనీయమైన ప్రధాన ప్రత్యర్థిగా మిగిలింది. అయితే అధికారాన్ని అందుకోవాలంటే దాని పురోగతి తర్వాత నుండి కొనసాగుతున్న నిర్మాణాత్మక, వ్యూహాత్మక సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. వామపక్షాలు ఇకపై ప్రధాన శక్తి కానప్పటికీ, అవి ఒక నిద్రాణమైన ఉనికిగానే ఉన్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులకు తగినట్లు మార్పులు చేసుకునే సామర్థ్యంపైనే వాటి భవిష్యత్తు గమనం ఆధారపడి ఉంటుంది.

ఈ నేపథ్యంలో, 2026 ఎన్నికలు ముందే నిర్ణయించబడిన ఫలితం కంటే, అవి పోటీ పడుతున్న సామర్థ్యాలకు మధ్య జరిగే పరీక్షగా నిలుస్తాయి. అధికారంలో కొనసాగేందుకు టిఎంసి సామర్థ్యం, మద్దతును విజయంగా మలచుకోవడంలో బిజెపి సామర్థ్యం, తమ ప్రాధాన్యాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలో అంటూ వామపక్షాల సామర్థ్యం ఇవన్నీ ఈ ఎన్నికల దిశను నిర్ణయిస్తాయి. ఈ దశలో బెంగాల్ ఒక కీలక మలుపులో ఉంది. ఇక్కడ కొనసాగింపు, మార్పు రెండూ పరస్పరం విరుద్ధం కాకుండా పెనవేసుకుపోయాయి. చివరికి ఫలితం రాజకీయ పార్టీల వ్యూహాలపై మాత్రమే కాకుండా, ఓటర్ల భావజాలంలో జరిగే సూక్ష్మ మార్పులపై కూడా ఆధారపడి ఉంటుంది. 

– గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)

– రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు