Reading Time: < 1 minute

కరీంనగర్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను ఫోన్ ట్యాప్ చేసినందుకు పిలిచారా? లేక కెటిఆర్ ఫోన్ ట్యాప్ అయినందుకు పిలిచారా? అని ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సిరిసిల్ల కేంద్రంగా సాగిందని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల దందా సాగిందని ఆరోపణలు చేశారు. సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి ఎలా లబ్ధిపొందారా తనకు తెలుసుననన్నారు. అన్ని కేసుల్లో సిట్ విచారణలకు ముగింపు ఉంటుందని, ఫోన్ ట్యాపింగ్‌లో మాత్ర సీరియల్‌లా ముగింపు లేదని ఎద్దేవా చేశారు. సిట్ విచారణలో అధికారులకు ఎంత స్వేచ్ఛ ఇచ్చారనేది అనుమానంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వ తీరుతో సిట్ అధికారులు బాధపడుతున్నారని, అసలు కెటిఆర్ ఎందుకు పిలిచారు? అని బండి ప్రశ్నించారు.  సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం నడిచిందని, ఫోన్‌ ట్యాపింగ్‌ కీలక సూత్రధారి ప్రభాకర్‌రావుపై ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారని, విచారణలో సిట్‌ సాధించిందేంటి? అని అడిగారు. మాజీ సిఎం కెసిఆర్ కూతురే తన ఫోన్‌ ట్యాప్‌ అయిందని చెప్పారని, ట్యాపింగ్‌కి భయపడి ఓ ఏడాది పాటు హరీష్‌ ఫోన్‌ ఉపయోగించలేదన్నారు. కెసిఆర్‌ హయాంలో బిచ్చగాళ్లు కూడా వాట్సాప్‌ కాల్ మాట్లాడాల్సిన పరిస్థితి ఉండేదని, తనని కూడా విచారించి వాంగ్మూలం తీసుకున్నారని, కానీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవుతున్నారు. రెండో రోజుల క్రితం హరీష్ రావును సిట్ అధికారులు విచారించిన విషయం విధితమే.