Reading Time: 2 minutes

ఎన్డీడీబీ చేతికి మదర్ డెయిరీ

Caption of Image.
  • ఎన్​డీబీబీ చేతిలో  15 ఏండ్లు ఉండేలా ఒప్పందం
  • లాభాల నుంచి రూ. 70 కోట్ల నష్టాల్లో డెయిరీ
  • ఎన్​డీడీబీతో పలుమార్లు చర్చలు
  • చిట్యాల ల్యాండ్​ అప్పగింతకు సుముఖం
  • డెయిరీకి లీటర్​కు రూ. 6.50 కమీషన్
  • ఏటా రూ. 5 కోట్లు గుడ్​ విల్​
  • సీఎం రేవంత్​ను కలిసిన ఎన్​డీడీబీ చైర్మన్​
  • ఎన్​వోసీ ఇవ్వడానికి సీఎం సుముఖత!

యాదాద్రి, వెలుగు : ఎన్​వోసీ ఇవ్వడానికి సర్కారు ఒప్పుకోవడంతో నష్టాల్లో ఉన్న నార్ముల్​ (మదర్​ డెయిరీ)ని టేకోవర్​ చేయడానికి ఎన్​డీడీబీ రెడీ అయింది. ఈ వారంలో అగ్రిమెంట్లు పూర్తి కాగానే బ్యాంకు అప్పులు తీర్చడంతో పాటు పాడి రైతుల బకాయిలను ఎన్​డీడీబీ చెల్లించనుంది. ఆ తర్వాత 15 ఏండ్ల పాటు నార్ముల్​ను ఎన్​డీడీబీ నిర్వహించనుంది. ఉమ్మడి నల్గొండ-రంగారెడ్డి జిల్లాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న నార్ముల్​  కు రెండు జిల్లాలో 311 సొసైటీలు ఉన్నాయి. గతంలో పటిష్టంగా కొనసాగిన డెయిరీ పలు కారణాల వల్ల తీవ్ర నష్టాల పాలయ్యింది. 

ఆస్తులను బ్యాంకుల్లో తనఖా పెట్టి తెచ్చిన డబ్బు కూడా సరిపోలేదు. చివరకు పాడి రైతులకు రూ. 25 కోట్లకు పైగా బకాయిలు పడింది. బ్యాంకుల్లో తీసుకున్న సొమ్ముతో కలిపి రూ. 70 కోట్లకు పైగా  అప్పులు అయ్యాయి. వీటికి వడ్డీ చెల్లించడం కూడా గగనంగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో డెయిరీని గట్టెక్కించడానికి ఇటీవల మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి, ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, డెయిరీ చైర్మన్​ మధుసూదన్​ రెడ్డి గుజరాత్​కు వెళ్లి ఎన్​డీడీబీ చైర్మన్ మనీశ్​ షాను కలిశారు. ప్రభుత్వం ఎన్​వోసీ ఇస్తే మదర్​ డెయిరీని టేకోవర్​ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. 

ఇక 15 ఏండ్లు ఎన్​డీడీబీ చేతిలోనే..!

ఎన్​వోసీ ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఎన్​డీడీబీకి నార్ముల్​ అప్పగింతకు మార్గం సుగమమైంది. తెలిసిన సమాచారం మేరకు ఈ వారంలోనే ఎన్​డీడీబీ, ఢిల్లీ మదర్​ డెయిరీ, నార్ముల్​(మదర్​ డెయిరీ) మధ్య ఒప్పందం చేసుకోనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎన్​డీబీబీ చేతిలో నార్ముల్​15 ఏండ్లు ఉండాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో తనఖా ఉన్న నల్గొండ జిల్లా చిట్యాలలోని 29 ఎకరాల భూమిని ఎన్​డీడీబీకి అమ్మడానికి డెయిరీ రెడీగా ఉంది. అయితే రేటు నిర్ణయం విషయంలోనే ఇంకా స్పష్టత రాలేదు. ఎకరానికి రూ. 1.50 కోట్లు ఇవ్వడానికి ఎన్​డీడీబీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ వచ్చే డబ్బుతో బ్యాంకుల అప్పు తీర్చడంతో పాటు రైతులకు పెండింగ్​లో ఉన్న బిల్లులు రూ. 25 కోట్లకు పైగా చెల్లించనుంది. 

సేకరణ మదర్​ డెయిరీ.. 

విక్రయాలు ఈ ఒప్పందం ప్రకారం రైతుల నుంచి పాల సేకరణ బాధ్యత నార్ముల్​ (మదర్​ డెయిరీ) తీసుకుంటే, విక్రయాల బాధ్యత మాత్రం ఎన్​డీడీబీ ఆధ్వర్యంలో ఢిల్లీ మదర్​ డెయిరీ నిర్వహించనుంది. పాలను సేకరించినందుకు నార్ముల్​కు ఒక్కో లీటర్​కు రూ 6.50 కమీషన్​ ఇవ్వనుంది. పాల సేకరణను 23 వేల లీటర్లు నుంచి లక్ష లీటర్లు  చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నార్ముల్​కు ప్రతిఏటా రూ. 5 కోట్లు గుడ్​ విల్​గా ఇవ్వడానికి ఎన్​డీడీబీ ఓకే చెప్పింది. 

సీఎంను కలిసిన ఎన్​డీడీబీ చైర్మన్​

మదర్​ డెయిరీ టేకోవర్​ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని ఆయన నివాసంలోనే ఎన్​డీడీబీ చైర్మన్​ మనీశ్​షా కలిశారు. డెయిరీ అప్పులు, ఆస్తులపై చర్చ జరిగింది. ప్రభుత్వం నుంచి ఎన్​వోసీ వస్తే టేకోవర్​ చేస్తామని ఎన్​డీడీబీ చైర్మన్​ తెలిపారు. దీంతో సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా నార్ముల్​ వర్గాలు తెలిపాయి. ఈ చర్చల్లో  మదర్ డెయిరీ ఢిల్లీ చైర్మన్ జయతీర్థా చారి, భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి, ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, డెయిరీ డెవలప్​మెంట్​ కో ఆపరేటీవ్​ ఫెడరేషన్​ చైర్మన్​ గుత్తా అమిత్​ రెడ్డి, నార్ముల్​ చైర్మన్​ మధుసూదన్​ రెడ్డి ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.