
అమరావతి: మాచర్ల పరువు హత్య కేసులో ఓ పోలీస్ అధికారి ప్రేమ జంటను విడదీసి యువతిని తండ్రికి అప్పగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతోనే కూతురును తండ్రి హత్య చేసినట్టు తెలుస్తోంది. పోలీస్ అధికారితో ఒప్పంద ప్రకారమే కూతురిని తండ్రికి అప్పగించాడని నిందితులు విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం….. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్లలో చంద్ర శీను, గంగ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు చౌడేశ్వరి(22) అనే కూతురు, కుమారుడు ఉన్నాడు. జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజుతో చౌడేశ్వరికి పరిచయం ఉండడంతో ప్రేమగా మారింది. తన కూతురును ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చంద్రశీను నిర్ణయం తీసుకున్నాడు. రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉందనగా చౌడేశ్వరి తాను ప్రేమించిన నాగరాజుతో వెళ్లిపోయింది. దీంతో తన ఇంట్లో బంగారం తీసుకొని కూతురు పారిపోయిందని స్థానిక పోలీస స్టేషన్‌లో చంద్రశ్రీను ఫిర్యాదు చేశాడు. కూతురును పట్టిస్తే భారీగా డబ్బు ఇస్తామని పోలీస్ అధికారికి తండ్రి ఆశ చూపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోలీసులు కేసు నమోదు చేసి కూతురు, నాగరాజును పిఎస్‌కు తీసుకొచ్చారు. కట్టుబట్టలతోనే బయటకు వచ్చామని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లలేదని ప్రేమ జంట తెలిపింది. ఐదు రోజులు పుట్టింట్లో ఉండి తరువాత భర్త వద్దకు వెళ్లేలా పిఎస్ లో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో పోలీసులు పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్చి 19న భర్త ఇంటికి వెళ్లాల్సి ఉండగా మార్చి 18న ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం తెలిసింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్షలో ఆమె ఊపిరాడక చనిపోయిందని తేలడంతో తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తన మేనల్లుడు పచ్చిపాల శ్రీనుతో కలిసి తన కూతురు ముఖంపై దిండు అదిమిపెట్టి చంపేశామని తండ్రి ఒప్పుకున్నాడు. ప్రేమ పెళ్లి చేసుకుందని కోపంతో తన కూతురు చంపానని తండ్రి విచారణలో ఒప్పుకున్నాడు. యువతి ప్రేమ పెళ్లి చేసుకున్న తరువాత పోలీసులు ఆమె పుట్టింటికి పంపించడంతోనే ఈ హత్య జరిగిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో తండ్రి ఆమెను చంపి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ పోలీసులు యువతిని లవర్ తో పంపించి ఉంటే హత్య జరిగి ఉండేది కాదని నెటిజన్లు వాపోతున్నారు.