Reading Time: 2 minutes
Up Video Ips Vidyasagar Mishra Emotional Farewell Police Cry

స్కూల్ టీచర్లు బదిలీ అయినప్పుడు విద్యార్థులు కన్నీటి పర్యంతం అయిన సంఘటనలు మీడియాలో చాలా చూశాం. కానీ విచిత్రంగా పోలీస్ శాఖలో ఒక ఐపీఎస్ అధికారి బదిలీ.. పోలీసులకు కంటతడి తెప్పించింది. వీడ్కోలు సమయంలో పోలీసులందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏ శాఖలోనైనా స్ట్రిట్ ఆఫీసర్ ఉంటే ఎప్పుడు వెళ్లిపోతాడా? అంటూ శాపనార్థాలు పెడుతుంటారు. త్వరగా ట్రాన్స్‌ఫర్ కావాలని కోరుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఒక ఎస్పీ బదిలీ సమయంలో పోలీసులంతా కంటతడి పెట్టారు. ఎందుకు ఇంతగా ఎమోషనల్ అయ్యారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో అత్యంత చురుకైన అధికారుల్లో ఒకరు. ఆయన ప్రవర్తన గురించి గానీ.. పోలీసింగ్ తీరు గురించి గానీ ప్రత్యేకంగా చర్చించుకుంటారు. అంత పాఫులర్. తాజాగా రాంపూర్‌ పోలీస్ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో విద్యాసాగర్ మిశ్రా కూడా ఉన్నారు. 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సోమేంద్ర మీనా కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా 11వ పీఏసీ బెటాలియన్ కమాండర్‌గా సీతాపూర్‌కు బదిలీ అయ్యారు.

విద్యాసాగర్ మిశ్రా బదిలీ కావడంతో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపూర్‌లో ఉన్న పోలీసులంతా వీడ్కోలు చెబుతుండగా ఒక్కసారిగా వాతావరణం దు:ఖ సాగరంగా మారిపోయింది. మహిళా పోలీసులంతా కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసులందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో ఆయన ఏడ్వొద్దు అంటూ శాంతింపజేశారు. అయినా కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలిచాయి.

ఐపీఎస్ విద్యా సాగర్ మిశ్రా ఎవరు?
అసలు ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఎవరు?. వీడ్కోలు సమయంలో పోలీసులు అంతగా ఎందుకు ఏడ్చారు. పోలీస్ శాఖపై ఆయన చూపించిన ప్రభావం ఎంత? వివరాలు తెలుసుకుందాం.

ఉత్తర ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన విద్యా సాగర్ మిశ్రా తండ్రి కోల్‌కతా పోలీసులో కానిస్టేబుల్‌గా పనిచేశారు. విద్యా సాగర్ మిశ్రా ప్రభుత్వ పాఠశాలలో విద్యను పూర్తి చేశారు. బాన్‌స్తేలోని అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో చదువును ప్రారంభించి… అనంతరం తన తండ్రితో కలిసి కోల్‌కతాకు వెళ్లారు. అక్కడ 8వ తరగతి చదువును పూర్తి చేశారు. 1983లో వెస్ట్ బెంగాల్ బోర్డ్ నుంచి 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత కోల్‌కతా విశ్వవిద్యాలయం పరిధిలోని సిటీ కాలేజీలో చేరి బీఎస్‌సీ పట్టా పొందారు.

తండ్రిని యూనిఫాంలో చూసి విద్యాసాగర్ మిశ్రాకు కూడా పోలీసు వృత్తిపై మమకారం పెంచుకున్నారు. అప్పుడే ఐపీఎస్ అధికారి కావాలని నిర్ణయించుకున్నారు. కోల్‌కతా విడిచిపెట్టిన తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఆ తర్వాత రెండు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా.. తన కలను నెరవేర్చుకోవడానికి వాటిని తిరస్కరించారు. 1993లో పీపీఎస్‌కు ఎంపికై.. తదనంతరం 2015లో ఐపీఎస్‌కు పదోన్నతి పొందారు. పోలీసు అధికారి అయిన తర్వాత.. ఉత్తర ప్రదేశ్‌లోని అనేక ప్రధాన జిల్లాల్లో పనిచేసి అత్యద్భుతంగా రాణించారు. మంచి గుర్తుంపు కూడా తెచ్చుకున్నారు.

రాజీపడని అధికారులు
యూపీ పోలీస్ దళంలో ఏ విషయంలోనూ రాజీపడని అధికారుల్లో ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఒకరుగా పేరు గాంచారు. ఈనాటికీ ఆయన పేరు వినగానే నేరగాళ్లు వణికిపోతారని చెప్పుకుంటారు. ఆయన పేరిట 45కు పైగా ఎన్‌కౌంటర్లు ఉన్నాయి. ఇక తన సహోద్యోగులతోనూ… ప్రజలతో ఎంతో నిరాడంబరంగా ఉంటారు. తన జూనియర్ అధికారులను.. పోలీసులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతుంటారు. అందుకే ఆయన బదిలీ సందర్భంగా అందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.