Reading Time: < 1 minute
జస్ట్‌ 45 మినెట్స్.. ఇక Hyd- సోమశీల, శ్రీశైలం ప్రయాణం మరింత సులభం.. ఇదిగో పూర్తి వివరాలు

తెలంగాణ టూరిజం శాఖ మరో ఆకర్షణీయ నిర్ణయం తీసుకుంది. ఇకపై పర్యాటకులు, భక్తులు ఆకాశ మార్గంలో సోమశిల, శ్రీశైలం సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 9 నుంచి ప్రత్యేక హెలికాప్టర్ సేవలు ప్రారంభం కానున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల అందాలు, కృష్ణానది సోయగాలు, ఆ తర్వాత శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ఆల్‌ ఇన్ వన్ టూర్‌గా ఈ ప్యాకేజీ రూపొందించారు. ఇది పర్యటనతో పాటు ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా ప్లాన్ చేశారు. ఈ ప్రయాణంలో భక్తుల ఆకాశంలో విహరిస్తూ ప్రకృతి అందాలను చూడవచ్చు.

ఏ ప్యాకేజీ ఎంత అంటే ..?

ఒకరోజు ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి సోమశిలకు హెలికాప్టర్‌లో ప్రయాణం ఉంటుంది. అక్కడ కృష్ణానది అందాలు వీక్షణం, లలితాంబిక సోమేశ్వర ఆలయం దర్శనం. తర్వాత శ్రీశైలం వెళ్లే అవకాశం ఉంటుంది. చివరగా అదే రోజు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.1,10,000గా నిర్ణయించారు.

రెండు రోజుల ప్యాకేజీ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో సోమశిల, శ్రీశైలంలో బస, భోజన వసతి, వీఐపీ దర్శనాలు ఉంటాయి. ఒక్కొక్కరికి రూ.1,40,000గా ధర నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి హైదరాబాద్‌లో అదనపు బస సౌకర్యం కూడా కల్పించనున్నారు.

కొల్లాపూర్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు- జూపల్లి

ఈ హెలీ టూరిజం సేవలను హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. దీనిపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్ట్ ముందడుగు అని పేర్కొన్నారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ హెలికాప్టర్ టూర్‌తో సోమశిల, శ్రీశైలం ప్రాంతాలకు పర్యాటకుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.