Reading Time: < 1 minute

టీచర్ల సమస్యలపై పోరాటాలకు సిద్ధం.. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి

Caption of Image.

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: టీచర్లు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతున్నామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి తెలిపారు. శుక్రవారం కొత్తగూడెంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో పీఆర్సీ కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. పీఆర్సీ గడువు పొడిగించకుండా నివేదికలు తెప్పించి సంఘాలతో చర్చించి అమలు చేయాలని కోరారు. బకాయి ఉన్న నాలుగు డీఏ వాయిదాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారులకు పదోన్నతులు ఇవ్వాలని సూచించారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యా రంగ నిపుణులతో చర్చించకుండా, అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా విద్యా కమిషన్ నివేదికను ఏకపక్షంగా అమలు చేయడం సరికాదన్నారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా అధ్యక్షుడు బి.మురళీ మోహన్, ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, నేతలు ఎస్.వెంకటేశ్వర్లు, కిషోర్ సింగ్, పాషా, హథీరాం, పద్మారాణి, జయరాజు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.