
- లక్సెట్టిపేట మున్సిపాలిటీలో మరో నాలుగు పోస్టులు
- మిగతా బల్దియాల్లో నోటిఫికేషన్ ఆలస్యం
- అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యేల చేతుల్లోనే..
మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ పదవుల భర్తీపై పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు బెల్లంపల్లి, మందమర్రి, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన మందమర్రిలో ఈసారి కూడా ఎన్నికలు జరగలేదు. ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వివిధ కారణాలతో వాయిదాపడగా, తిరిగి శనివారం నిర్వహిస్తున్నారు.ఈ మూడు మినహాయిస్తే.. ఇప్పటివరకు మంచిర్యాల కార్పొరేషన్, లక్సెట్టిపేట మున్సిపాలిటీలో మాత్రమే కో ఆప్షన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది.
మిగతా మున్సిపాలిటీల్లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా? అని లీడర్లు ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగి రెండు నెలలు కావస్తున్నా కో ఆప్షన్ పదవుల భర్తీలో జాప్యం జరుగుతుండడంతో నాయకులు నారాజ్ అవుతున్నారు. లక్సెట్టిపేట మున్సిపాలిటీలో నాలుగు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో ఐదు కో ఆప్షన్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ రిలీజైంది. మున్సిపల్ పరిపాలనలో అనుభవం ఉన్న ముగ్గురికి చాన్స్ ఉండగా, అందులో ఒకరు మహిళ ఉండాలి. మరో రెండు పోస్టులను మైనారిటీ వర్గాలకు కేటాయించగా, అందులోనూ తప్పనిసరిగా ఒక మహిళను నియమించాలి.
మొత్తం ఐదు పోస్టులకు గాను రెండు మహిళలకు, మూడు పురుషులకు కేటాయించారు. అర్హతలు ఉండి ఆసక్తి కలిగినవారు ఈ నెల 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. లక్సెట్టిపేటలో నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, దరఖాస్తులకు ఈ నెల 7 వరకు గడువుంది. మున్సిపల్ పరిధిలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన ఇద్దరు సభ్యులు, అందులో ఒకరు మహిళ, మైనారిటీ వర్గాల నుంచి ఇద్దరికి చాన్స్ ఉండగా, అందులోనూ ఒకరు మహిళ అయి ఉండాలి.
మంచిర్యాలలో అభ్యర్థులు ఖరారు?
మంచిర్యాల కార్పొరేషన్‌కు సంబంధించి ఇప్పటికే క్యాండిడేట్ల పేర్లు ఖరారైనట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. గౌతమినగర్ ఏరియా నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయిన ఓ లీడర్‌తో పాటు మహిళా కోటాలో ఓ మాజీ కౌన్సిలర్ పేరు లిస్టులో ఉన్నట్టు తెలిసింది. ఇందులో ఒకరికి ఇటీవలే డీసీసీలో కీలక పోస్టు దక్కింది. ఆయన గతంలో కౌన్సిలర్‌గా పని చేసిన అనుభవంతో పాటు ముఖ్యనేత సామాజికవర్గం కావడంతో కో ఆప్షన్‌గా ఎంపిక చేసినట్టు గుసగుసలాడుకుంటున్నారు. మరో మాజీ కౌన్సిలర్ భర్త పీసీసీ పోస్టులో స్టేట్ లెవల్ లీడర్‌గా కొనసాగుతున్నప్పటికీ ఆమెకు కో ఆప్షన్ ఇచ్చి ఒకే ఇంట్లో రెండు పదవులు కట్టబెడుతారా? అని పెదవి విరుస్తున్నారు.
మరో పోస్టులో ఎమ్మెల్యేకు సన్నిహితుడైన ఒక రిటైర్డ్ టీచర్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మైనారిటీ వర్గాల నుంచి ఒక క్రిస్టియన్, ముస్లిం సామాజికవర్గం నుంచి హోటల్స్ యజమాని భార్య పేర్లు ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో కో ఆప్షన్ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఈసారి కూడా తమకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు.
బెల్లంపల్లిలో పోటాపోటీ..
బెల్లంపల్లి బల్దియాలో నాలుగు కో ఆప్షన్ పదవుల కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు అభ్యర్థుల ఎంపిక ఇబ్బందిగా మారనుంది. నాలుగు పోస్టులకు రెండు జనరల్, రెండు మైనార్టీలకు రిజర్వు చేయడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఈ పదవులకు మాజీ కౌన్సిలర్లు రొడ్డ తులసీదాస్, గుజ్జ రవి, కె.సతీశ్, ఎం.భాగ్యలక్ష్మి, సీహెచ్.హేమలత, నెల్లి రమేశ్, ఎన్. శ్రీలత, జి.రాజలింగు, ఎస్.లావణ్య పేర్లు వినిపిస్తున్నాయి.
మైనారిటీ కోటాలో ఎండీ. అఫ్జల్, ఎంఏ.నయీమ్, జాన్‌సుందర్, కె.దయామణి, ఆస్మా షేక్ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండడంతో ఎవరికి వారే తమ పైరవీలు చేస్తున్నారు.
నిర్మల్, కాగజ్‌నగర్‌లో..
నిర్మల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్ పోస్టులకు పోటీ నెలకొంది. ఇక్కడ గతంలో వైస్ చైర్మన్ పదవిని మైనారిటీలకు ఇచ్చేవారు. ఈసారి వారికి చాన్స్ రాకపోవడంతో నాలుగు కో ఆప్షన్ పోస్టులు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్ కేటగిరీలో వారికి ఒక పోస్టు ఉంటుంది. మరో రెండు జనరల్, ఒకటి క్రిస్టియన్ సామాజిక వర్గానికి కేటాయించాల్సి ఉంది.
కానీ, మిగతా మూడు పోస్టులకు సైతం ముస్లిం సామాజికవర్గం నుంచే పోటీపడుతున్నారని తెలిసింది. కాగ జ్ నగర్ మున్సిపాలిటీలో 4 కో ఆప్షన్ మెంబెర్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ తిరుపతి సూచించారు. ఇందులో ఇద్దరు మహిళలకు అవకాశం ఇవ్వనున్నారు.
ఎమ్మెల్యేల ఆశీస్సులు ఉంటేనే..
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ కో ఆప్షన్ పోస్టులకు గట్టి పోటీ నెలకొంది. ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు లీడర్లు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్లు, కార్పొరేటర్లుగా పోటీచేసి ఓడిపోయినవారు, దశాబ్దాల నుంచి పార్టీ జెండాలు మోస్తున్న నాయకులు చాలామంది కో ఆప్షన్ పదవులను ఆశిస్తున్నారు. పార్టీ హైకమాండ్ అభ్యర్థుల ఎంపిక నిర్ణయాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలకే వదిలేయడంతో ఆశావహులంతా వారి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు.