
హైదరాబాద్: మేధావి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఈబ్రహీం అలీ అబూబకర్ సిద్ధిఖీ (89) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. దేశంలో వరి వంగడాల పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. హైబ్రిడ్ వరి సాగును ప్రోత్సహించడంతో పాటు ఎక్కువ మొత్తంలో ఉత్పతి చేయడంతో ఆయనను ‘భారత హైబ్రిడ్ వరి పితామహుడు’ అని పిలుస్తారు.
ఇవాళ భారత దేశం బియ్యం ఎగుమతుల్లో తొలి స్థానంలో ఉండటానికి ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని రైతుల, మేధావులు ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలో అధిక దిగుబడినచ్చే పొట్టి రకం బాస్మతి వంగడం ‘పూసా బాస్మతీ-1’ని అభివృద్ధి చేశారు. వరి ఉత్పత్తిలో విశేషమైన కృషి చేయడంతో ఆయన భారత ప్రభుత్వం పద్మశ్రీతో పురస్కరించింది. ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ పేరు మీద ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు కూడా ఆయనను వరించింది. ఇండియన్ కౌన్సిల్ ఆప్ అగ్రికల్చరల్ రీసెర్చ్, హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆప్ రైస్ రీసెర్చ్‌లో డైరెక్టర్‌గా సేవలందించారు. తమిళనాడుకు చెందిన సిద్ధిఖీ రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు.