Reading Time: < 1 minute

 తెలంగాణ ఏర్పడిన తర్వాత దురదృష్టవశాత్తు సింగరేణి నష్టాల బాట పట్టి ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందని, ఇందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం పూర్తిగా సింగరేణిపై అజమాయిషీ చేసిందని, బోర్డు కేవలం నామమాత్రంగా మారిందని విమర్శించారు. టెండర్ల నుంచి చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతిచోటా కేసీఆర్ కుటుంబ ఆదేశాలే అమలయ్యాయని, రాజకీయ జోక్యంతో సింగరేణిని సమస్యల్లోకి నెట్టారని విమర్శలు దాడి చేశారు. ఈ విషయం తెలంగాణ సమాజానికీ, సింగరేణి కార్మికులకూ బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ…

బిఆర్‌ఎస్ హయాంలోనే కాకుండా గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా సింగరేణిపై ఆర్థిక విధ్వంసం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర అవుతోందని, సింగరేణిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఖర్చు తగ్గింపుపై నివేదిక సిద్ధం చేయించామని వివరించారు. ఆ నివేదికపై సింగరేణి అధికారులతో చర్చించి సంస్థ ఆర్థిక పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. ఈ అంశాలన్నింటినీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లకు వివరించామని అయితే అప్పట్లో నైని కోల్ బ్లాక్ అంశంపై ఎలాంటి చర్చ కూడా జరగలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.