Reading Time: < 1 minute

గ్రూప్ 1 పరీక్షల తుది తీర్పుపై ఇంకా ఉత్కంఠత వీడలేదు. గురువారం వెల్లడించాల్సి ఉండగా, తుది తీర్పు సిద్దంగా లేకపోవడంతో ఫిబ్రవరి 5వ తేదీన వెల్లడిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మెహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది. మొయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం తుది మార్కుల జాబితాతో పాటు ప్రకటించిన ర్యాంకుల జాబితా రద్దు చేస్తూ, పరీక్షా పత్రాలు పునఃమూల్యాంకనం చేయాలని,

అది సాధ్యం కాకపోతే మరల పరీక్షలు నిర్వహించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పును టిజిపిఎస్‌సితో పాటు గ్రూప్1కు ఎంపికయిన అభ్యర్థులు సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. వీటిపై అత్యున్నత ధర్మాసనం విచారించి తుది తీర్పునకు లోబడే నియామకాలు జరగాలని స్పష్టం చేస్తూ వాదనలు ముగించింది. అయితే తరువాత రాష్ట్ర ప్రభుత్వం 563 మందికి గ్రూప్1 నియామకపత్రాలు అందచేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేయడంతో తుది తీర్పుపై అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది.