
జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్న యువతిని అడ్డగించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 6న యువతి కళాశాలకు వెళ్తుండగా.. ఇద్దరు యువకులు ఆమెను అడ్డగించి బలవంతంగా కారులోకి ఎక్కించి నాపసర్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు.
కొన్ని గంటల పాటు కదులుతున్న కారులో ఆమెపై ఆఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ క్రమంలో కారు ఓ గ్రామంలోకి ప్రవేశించడంతో స్థానికులకు అనుమానం వచ్చి ఆపారు. దీంతో ఆ యువతిని కారులో నుంచి బయటకు తోసేసి అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. గ్రామస్థులు బాధిత యువతి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జనవరి 11న భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.