
న్యూఢిల్లీ : గిగ్ కార్మికుల కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సోమవారం బ్లింకిట్ డెలివరీ ఏజెంట్‌గా అవతారమెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. “గిగ్ కార్మికులు రోబోలు కాదు. ఈ విషయంపై చట్టసభ ఆలోచించాలి. రేటింగ్ తగ్గించడం, ప్రోత్సాహకాల్లో కోత, ఐడీ బ్లాక్ వంటి భయాలతో నిర్ధిష్ట సమయంలో డెలివరీ చేసేందుకు కార్మికులు వేగంగా,సిగ్నల్స్ జంప్ చేస్తూ వెళ్లాల్సి వస్తోంది. ఈ సందర్భంగా వీరు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇక కస్టమర్ల వేధింపులు,ప్రమాదకర పరిస్థితిలో పని చేయాల్సి రావడం వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అని ఆయన తన వీడియో లో ప్రస్తావించారు. రాజ్యసభ లోనూ జీరో అవర్‌లో ఆయన గిగ్ కార్మికుల సమస్యలపై పదేపదే ప్రస్తావించారు కూడా.