
టెహ్రాన్ : ఇరాన్‌లో ఖమేనీ వ్యతిరేక ప్రదర్శకులపై అక్కడి అధికార యంత్రాంగం తీవ్రస్థాయిలో చర్యలకు దిగుతోంది. ఇరాన్‌లో సాగుతోన్న ఇటీవలి ఘర్షణల్లో పాల్గొన్న 26 సంవత్సరాల యువకుడిని గుర్తించారు. ఈ యువకుడిని బుధవారం హిరంగంగా ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఖమేనీ మద్దతుదార్లు వెల్లడించారు. ఇరాన్‌లో గత వారం ఖమేనీ వ్యతిరేక ప్రదర్శనలు సంచలనాత్మక రీతిలో జరిగాయి. ఈ దశలో అరెస్టు అయిన యువకుడు ఎర్ఫాన్ సొల్తానీకి పాలకులు మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు వెలువరించారు.
మత ఛాందసవాద పాలనకు నిరసనగా సాగిన ఉద్యమాల దశల్లో ఇంతకు ముందు కూడా మరణశిక్షలు అమలు జరిపారు. చాలా వరకూ విచారణలకు అవకాశం లేకుండానే తుపాకీతో కాల్చిచంపడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యువకుడిని ఉరితీసి చంపుతారని, ఈ క్రమంలో ఇప్పటి ఘర్షణల తొలి ఉరితీత ఇదే అవుతుందని వెల్లడైంది. ఈ పరిణామంపై ఆందోళనకారులు, హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.