
న్యూఢిల్లీ: మధుమేహం (డయాబెటిస్) వల్ల ప్రపంచంలోనే రెండో స్థానంలో 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారంతో భారతదేశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. 16.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారంలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 11ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారంతో చైనా మూడో స్థానంలో ఉందని ఈ అధ్యయనం అంచనా వేసింది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ అప్లయిడ్ సిస్టమ్స్ అనాలిసిస్, ఆస్ట్రియాలోని వియన్నా యూనివర్శిటీ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.
2020 నుంచి 2050 మధ్య కాలంలో 204 దేశాల్లో డయాబెటిస్ ప్రభావం వల్ల ఆర్థిక భారం ఎంత ఉంటుందో అంచనా వేశారు. ఆయా కుటుంబ సభ్యుల నుంచి అందే ప్రాథమిక సాధారణ వైద్యసాయం మినహాయించి ప్రపంచ స్థాయిలో వ్యయం 10 ట్రిలియన్ డాలర్ల వరకు ఉంటుందని , ప్రపంచ వార్షిక జిడిపిలో 0.2 తో ఇది సమానమని అధ్యయనం పేర్కొంది.