
రాష్ట్ర ప్రజల ఆస్తులు కరిగిపోతున్నాయి
అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం
కెసిఆర్ ప్రజలకు మంచి చేశారు కాబట్టే
ఆయనను ప్రజలు మరిచిపోలేకపోతున్నారు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయంటే, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కెసిఆర్ ప్రజలకు మంచి చేశారు కాబట్టే ఆయనను ప్రజలు మరిచిపోలేకపోతున్నారని తెలిపారు. కెసిఆర్ చేసిన అభివృద్ధితో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. రేవంత్‌రెడ్డికి ప్రభుత్వాన్ని నడపడం రావడం లేదని అన్నారు.అప్పట్లో రూ.5 లక్షలు ఉన్న భూమి.. 30 నుంచి 50 లక్షలకు పెరిగిందని అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ స్తంభించిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో భూముల రేట్లు తగ్గాయని చెప్పారు. ఇప్పుడు ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ 24 నెలల వైఫల్య పాలనలో కెసిఆర్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బులు లేకుండా పరిస్థితులు దిగజారిపోయాయి, వ్యాపారాలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన బండ్లగూడ మాజీ మేయర్ శ్రీలత ప్రేమ్ గౌడ్, వారి అనుచరులు కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నేత కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కెసిఆర్ అత్యంత నిష్ఠతో పనిచేశారని వ్యాఖ్యానించారు. నగరంలో పది సంవత్సరాలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. పది సంవత్సరాల కింద హైదరాబాదులో ఉన్న కరెంటు కోతలు, తాగునీటి తిప్పలు, అస్తవ్యస్తపు రోడ్లను హైదరాబాద్ నగర ప్రజలు చూశారని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారు
2014కు ముందు కరెంటు పరిస్థితి ఎలా ఉండేది.. కెసిఆర్ వచ్చాక ఎలా మారిందో గుర్తుతెచ్చుకోవాలని కెటిఆర్ సూచించారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యలు పరిష్కరించి.. అందరికీ నాణ్యమైన విద్యుత్ అందజేశారని గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు, పార్కులు కట్టుకున్నామని పేర్కొన్నారు. మన రాష్ట్రం, మన ప్రజల కోసం పనిచేశామని చెప్పారు. రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని విమర్శించారు. మోసం చేసేవారికే ప్రజలు అధికారం కట్టబెడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
ప్రజలకు అలివికాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. ఆనాడు రెట్టింపు పెన్షన్లు, రైతుబంధు, దళిత బంధు, రెండు లక్షల ఉద్యోగాలు, పిఆర్‌సి.. ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించి ఒక్కదాన్ని అమలు చేయకుండా విజయవంతంగా తెలంగాణ ప్రజలను 24 నెలలుగా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలని, తూతూ మంత్రంగా కేవలం మీడియా హెడ్‌లైన్ల కోసం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పైన దృష్టి సారించి దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వరుసగా దిల్‌సుఖ్‌నగర్, ఆర్‌టిసి క్రాస్ రోడ్‌తోపాటు అనేకచోట్ల విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్‌టిసి క్రాస్ రోడ్ లో బట్టల షాపు ప్రారంభోత్సవానికి పోయిన రేవంత్ రెడ్డి పక్కనే గతంలో రాహుల్ గాంధీ నిరుద్యోగులతో సమావేశమైన గాంధీనగర్‌కు పోలేకపోయారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అవి తమవి అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రైతులను రైతు కూలీలను కౌలుదారులను విద్యార్థులను మహిళలను వృద్ధులను ప్రభుత్వ ఉద్యోగులను ఇలా అందరిని మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయమని అడిగితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నరని మండిపడ్డారు. ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే రేవంత్ రెడ్డి తనకు తెలిసిన భాషలో మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డికి తెలుగు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ భాషలు రావు కానీ ఆయనకు వచ్చిన ఏకైక భాష బూతుల భాష అని ఎద్దేవా చేశారు. హామీలను అమలు చేయమన్నందుకు ప్రతిపక్షాలను ప్రజలను ప్రతి ఒక్కరిని బూతులు తిడుతున్నారన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎల పరిస్థితి దయనీయంగా ఉన్నది
పార్టీ మారిన ఎంఎల్‌ఎలపై ఈ సందర్భంగా కెటిఆర్ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నదని అన్నారు. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎంఎల్‌ఎలమని చెప్పుకుంటూ, స్పీకర్ దగ్గర మాత్రం బిఆర్‌ఎస్ పార్టీ అంటున్నారని విమర్శించారు. రాజేంద్రనగర్ ఎంఎల్‌ఎ ప్రకాష్ గౌడ్ ఏ అభివృద్ధి చూసి కాంగ్రెస్ పార్టీలో చేరారో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పందిలాగా వందేళ్లు బతకొద్దు.. నంది లెక్క నాలుగేళ్లు బతికినా చాలు అంటూ పార్టీ మారిన ఎంఎల్‌ఎలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో చేసిన మోసం చాలు అనిని.. పాలనపై, హామీల అమలుపై దృష్టి పెట్టాలంటూ సిఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.