
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా పెరిగిన రద్దీ..
నందిగామ వై జంక్షన్ వద్ద నరకయాతన
ప్రయాణీకులతో రవాణా కేంద్రాలు కిటకిట
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కిలో మీటర్ మేర క్యూలైన్
సొంతూళ్లకు చేరుకోవాలనే దృఢ సంకల్పంతో ప్రజలు చిన్న పాటి యుద్ధమే చేస్తున్న వైనం
మన తెలంగాణ/హైదరాబాద్ : సంక్రాంతి పర్వదినాలనును పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు సొంతూళ్లకు ప్రయాణం కావడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం ఉదయం నుంచి రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఎపి వైపుకి వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఎక్కువ టోల్ బూత్‌లను ఓపెన్ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 70వేల వాహనాలు ఎపి వైపు వెళ్లాయని పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు.
మరింత రద్దీ పెరగ గలదని అధికారులు అంచనాగా ఉంది. ప్రధానంగా టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరినప్పుడు సిబ్బంది వాహనాల వద్దకు వచ్చి ఫాస్టా గ్‌ను స్కాన్ చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద ఒక స్టిక్ మిషన్, నాలుగు హ్యాండ్ మిషన్లు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి మొత్తం 273 కిలోమీటర్లు మేర ఉంటుంది. చౌటుప్పల్ శివారు పంతంగి, కేతేపల్లి వద్ద కొర్లపహాడ్, ఎపిలోని చిల్ల కల్లు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. మూడు టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్, అంబులెన్సును ఏర్పాటు చేశారు. ప్రతి 30 కిలో మీటర ్లకు ఒక క్రేన్, పెట్రోలింగ్ వాహనం, అంబులెన్సు 60 కిలోమీటర్లకు ఒక టోయింగ్ వెహికిల్ ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లాలో ఉంగుటూరు మండ లం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. వాహనాలను నియంత్రించలేక టోల్ గేట్, పోలీసులకు ఇబ్బంది తప్పడం లేదు. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 10,000 వాహనాలు అధికంగా పెరిగాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చిల్లకల్ల్లు టోల్ గేట్ వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి మొత్తం 13,567 వాహనాలు తరలివెళ్లాయి.
నందిగామ వై జంక్షన్ వద్ద నరకయాతన
హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున కార్లు, బస్సులు ఇతర వాహనాల్లో సొంత ప్రాంతాలకు ఆంధ్ర ప్రాంతవాసులు తరలి వస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద జాతీయ రహదారిపై హైవే అండర్ పాస్ బ్రిడ్జికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణం అసంతృప్తిగా నిలిచిపోయింది. దీని వల్ల ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సర్వీస్ రోడ్డు మీద నుంచి వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. దీనివల్ల హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వాహనాలు రావటానికి నందిగామ వై జంక్షన్ వద్ద నరకయాతన అనుభవిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కావడం వల్ల కిలోమీటర్ల మేర కార్లు బారులు తీరుతున్నాయి. దీంతో నందిగామ మీదుగా హైవేపై వచ్చే వాహనాలు సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా యి. నందిగామ వై జంక్షన్ నుంచి నందిగామ పట్టణంలోకి వెళ్లే రహదారిలోనూ ట్రాఫిక్ జామ్ అయింది. సంక్రాంతి పండుగకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిసినా కూడా కీసర టోల్ ప్లాజా నిర్వాహకులు, హైవే అథారిటీ అధికారులు కనీసం రోడ్డుకు మరమ్మతులు చేయించక పోవడం గమమనార్హం. సర్వీస్ రోడ్డుపై గుంటలను పూడ్చలేదు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది.
ప్రయాణీకులతో రవాణా కేంద్రాలు కిటకిట
తెలుగు రాష్ట్రాల్లోని రవాణా కేంద్రాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోయాయి. పండుగకు ఎలాగైనా సొంత ఊళ్లకు చేరుకోవాలనే దృఢ సంకల్పంతో ప్రజలు చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టాండ్ కిక్కిరిసిపోగా, బస్సులు వచ్చిన వెంటనే నిండిపోతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైలు ఎక్కేం దుకు ప్రయాణికులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇదే రద్దీ దృశ్యాలు విజయవాడ నెహ్రూ బస్ స్టాండ్, వైజాగ్ ద్వారకా బస్ స్టాండ్లలోనూ దర్శనమిస్తున్నాయి.