Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోతుందని విమర్శించారు. కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని, పారిశుద్ధ్య నుంచి మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా శనివారం నగరంలో నిజామాబాద్, ఖమ్మం జిల్లాల బిఆర్‌ఎస్ నేతలతో కెటిఆర్ సన్నహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పార్టీ సీనియర్ నేత హరీష్ రావు, ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల బిఆర్‌ఎస్ నేతలకు పురపాలక ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాల పైన కెటిఆర్ దిశానిర్దేశం చేశారు.

మునిసిపల్ ఎన్నికల కు సంబంధించి పార్టీ తరఫున చేసుకోవాల్సిన ఏర్పాట్లను, ప్రజల ముందు ఉంచాల్సిన వివిధ అంశాలను ఆయన పార్టీ నేతలకు వివరించారు. రెండు జిల్లాలకు సంబంధించిన ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితుల పైన క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను అధికార దుర్వినియోగాన్ని తట్టుకొని మంచి ఫలితాలు సాధించామని, ఇదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోను మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్ప, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒకటి లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్, మోడల్ మార్కెట్ల వంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి నిధులు ఆపివేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది?

రాష్ట్రంలో ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతూ, మరోవైపు పట్టణాలను పడుకోబెట్టి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని కెటిఆర్ నిలదీశారు. ఈ రెండు సంవత్సరాల్లో ఆయా పట్టణాలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, ఇచ్చిన నిధులను వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పలు అంశాల పైన ఆయా జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేశారు. కలిసికట్టుగా సమిష్టిగా కొట్లాడి ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన పలు అంశాలను హరీశ్‌రావు నేతలకు వివరించారు. ఈ సమావేశాల సందర్భంగా ఆయా జిల్లాల నేతలు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పార్టీ సీనియర్ నేతలకు వివరించారు. ప్రభుత్వంపైన క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని, పార్టీకి అనుకూల వాతావరణ ఉన్నదని తెలిపారు.