
వాషింగ్టన్ : వెనెజువెలాపై సైనిక చర్య ద్వారా ఇప్పటికే ఆధిప త్యం సాధించిన అమెరికా తాజాగా గ్రీన్‌లాండ్‌పై తన వైఖరిని స్పష్టం చేసింది. ఆ దేశాన్ని త్వరలో స్వాధీనం చేసుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుండబద్ధలు కొట్టారు. చర్చల ద్వారా దీనికి పరిష్కారం దొరుకుతుందని ఆశించామని, కానీ అలా జరిగేలా లేదన్నారు. అక్కడి ప్రజలకు ఇష్టం ఉన్నా, లేకపోయినా తాము కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అయినప్పటికీ వచ్చే వారం తమ విదేశాంగ మంత్రి మార్క్ రూ బియో గ్రీన్‌లాండ్, డెన్మార్క్ దేశాధినేతలతో సమావేశమవుతారని చెప్పారు. శుక్రవారంనాడు ఆయన వైట్‌హౌస్‌లో మీడియా తో మాట్లాడారు. గ్రీన్‌లాండ్‌ను తాము స్వాధీనం చేసుకోకపోతే రష్యా, చైనా తమ వశం చేసుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆ రెండు దేశాలు ఇప్పటికే గ్రీన్‌లాండ్ చుట్టూ నౌకలను మోహరించి ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పొరుగుదేశాలుగా ఆ రెండింటిలో ఏ ఒక్కటటీ కూడా ఉండాలని అమెరికా కోరుకోవడం లేదన్నారు.
వ్యూహాత్మకంగా, రక్షణపరమైన అంశాలలో గ్రీన్‌లాండ్ తమకు అత్యంత కీలకమైనదన్నారు. వెనెజువెలాలో ఉన్న చ మురు నిల్వలను వెలికి తీసేందుకు అమెరికా కంపెనీలు ముం దుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అక్కడి చమురు వెలికితీత ద్వారా ఆ దేశ ప్రయోజనాలతో పాటు అమెరికాకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. చమురు కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు భద్రత కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు.
ఇదేంటో తెలుసా..?
మీడియా సమావేశంలో ట్రంప్ తన సూట్‌పై అమెరికా జాతీయ పతాకంతో పాటు ధరించిన ఓ లేబుల్ ఆకర్షణగా నిలిలించింది. దాని గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… ట్రంప్ స్పం దించారు. దీని గురించేనా మీరు అండిగింది.. ఇదేంటో తెలు సా? అని తిరిగి ప్రశ్నిస్తూ… దీన్ని తనకు కొంత మంది బహూకరించారని, దాని పేరు ‘హ్యాపీ ట్రంప్’ అని చెప్పారు. ‘అయితే నేనెప్పుడూ సంతోషంగా ఉండను.. సంతృప్తిగా కూడా ఉండను’ అని నవ్వులు చిందించారు. తల ఆకారం పెద్దదిగా ఉన్న ట్రంప్ ను గుర్తుకు తెచ్చే ఆ లేబుల్ ఎవరు బహూకరించాన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. అదే సమయంలో భారత్, పాక్ ఘర్షణ ల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇరు అణ్వాయుధ దేశాల నడుమ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకొచ్చారు. కొందరికి ట్రంప్ అంటే ఇష్టం ఉన్నా.. లేకపోయినా అది నిజం అన్నారు. అప్పటికే 8 జెట్‌లు కూలిపోయాయని అన్నారు. గత ఏడాది పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శ్వేతసౌధానికి వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజల ప్రాణాలు కాపాడారని తనను ప్రశంసించారని గుర్తు చేశారు. వెనెజువెలా తరహాలో రష్యాపై సైనికచర్య చేపట్టబోమని, పుతిన్ తనకు చిరకాల స్నేహితుడని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఆయన వైఖరితో విసిగిపోయాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు ఆపిన తాను నోబెల్ బహుమతికి అర్హుడినని, ఏమీ సాధించకున్నా మాజీ అధ్యక్షుడు ఒబామాను నోబెల్ పురస్కారం వరించడమేంటి అని అసంతృప్తి వ్యక్తం చేశారు.