
తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది, పోలీసు రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే సిఎం ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి పొర్లుదండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుని, అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కు పాదం మోపి తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్లు ఇప్పుడు నిరుద్యోగులకు లాఠీ చార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారు..మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేశారు…నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేశారు..రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిర్బంధాలను ఆపి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను లాకప్ హింసకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా బిఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరెస్టు చేసిన నిరుద్యోగ సోదరులను భేషరతుగా తక్షణం విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.