
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం చంద్రబాబు దగ్గరుండి ఖూనీ చేశారని వైసీపీ అధినేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను తాకట్టు పెట్టారని, చంద్రబాబు లాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరని అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని, రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా తాకట్టు పెట్టారో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిండుసభలో చెప్పారన్నారు. రాయలసీమ లిఫ్ట్‌పై వాస్తవాలు ప్రజలందరికి తెలియాలని, రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని కూటమి నేతలు అన్యాయంగా మాట్లాడుతున్నారని, దీనిని బట్టి చూస్తే కూటమికి రేవంత్ రెడ్డికి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోందని అన్నారు.
ఈ ప్రాజెక్టు రాయలసీమ, నెల్లూరుకు సంజీవని లాంటిదని, అలాంటి ప్రాజెక్టును అవసరం లేదంటున్న వీళ్ళ మాటలు చూస్తుంటే మనుషులేనా అనిపిస్తుందని జగన్ చెప్పారు. చంద్రబాబుది ఒక విలన్ క్యారెక్టర్ అని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అండ్ కో బరితెగించి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్లు ఉందన్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత మామను వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు తనకు జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణకు తాకట్టు పెట్టిందని, దీంతో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల రైతులకు కన్నీళ్లు మిగిల్చిందన్నారు.