Reading Time: < 1 minute

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. అనంతపురం జిల్లా కోర్టు రికార్డ్ అసిస్టెంట్‌తో పాటు అడిషనల్ మెజిస్ట్రేట్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.అటు ఏలూరులోని పిజెసిజె కోర్టుకు కూడా బాంబు పెట్టామంటూ మెయిల్ రావడంతో పోలీసులు కోర్టును ఖాళీ చేయించి సోదాలు నిర్వహించా రు. సైబర్ పోలీసులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చిత్తూరులో న్యాయమూర్తి సెల్‌ఫోన్‌కే బెదిరింపు సందేశం రావడంతో డిఎస్‌పి సాయినాథ్ నేతృత్వంలో పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని అణువణువూ గాలించారు. వరుసగా కోర్టులనే లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపులతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా కోర్టులో కూడా బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ బెదిరింపు మెయిల్‌తో అటు న్యాయవాదులు, ఇటు కక్షిదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.