Reading Time: < 1 minute

రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా నాలుగో ఓటమి చవిచూసింది. బుధవారం రాజ్‌కోట్ వేదికగా బరోడాతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన బరోడా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 417 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఓపెనర్లు నిత్య పాండ్య, అమిత్ పాసి సెంచరీలతో కదంతొక్కారు. చెలరేగి ఆడిన అమిత్ 93 బంతుల్లోనే 127 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన నిత్య పాండ్య 110 బంతుల్లో 122 పరుగులు సాధించాడు.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కృనాల్ పాండ్య 63 బంతుల్లోనే అజేయంగా 109 పరుగులు చేశాడు. భాను పానియా 42 (నాటౌట్) కూడా రాణించడంతో బరోడా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 49.5 380 పరుగులకు ఆలౌటైంది. అభిరథ్ రెడ్డి (130), ప్రఘ్నయ్ రెడ్డి (113) సెంచరీలతో కదంతొక్కారు. ఓపెనర్లు అమన్ రావు (39), తన్మయ్ అగర్వాల్ (32)లు కూడా సత్తా చాటారు. అయితే కీలక సమయంలో బరోడా బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు.