
శివాజీ నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రెండవ చిత్రంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ… శివాజీకి జంటగా నటించారు. ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. రంజిన్ రాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 12న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ చూశా. సూపర్‌గా ఉంది. చాలా నవ్వుకున్నా. డైరెక్టర్ సుధీర్ రైటింగ్, దర్శకత్వం చాలా బాగుంది. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా చూడాలని ఆసక్తి పెరిగింది.
టాలెంటెడ్ యాక్టర్, తెలుగు అమ్మాయి లయ సెకండ్ ఇన్నింగ్స్ లో ముందుకెళ్తున్నారు. ఈ సినిమాలో లయ క్యారెక్టర్ సూపర్‌గా ఉంది”అని అన్నారు. ప్రొడ్యూసర్, యాక్టర్ శివాజీ మాట్లాడుతూ “ఈ సినిమాలో అందరూ బాగా నటించారు. ప్రతి ఒక్కరికీ సినిమా నచ్చుతుంది”అని తెలిపారు. లయ మాట్లాడుతూ “డైరెక్టర్ సుధీర్ నేను చేసిన ఉత్తర క్యారెక్టర్‌ను బాగా తీర్చిదిద్దారు. శివాజీ ప్రొడ్యూసర్‌గా, యాక్టర్‌గా షూటింగ్ లొకేషన్స్‌లో ఎంతో ఉత్సాహంగా ఉంటూ అన్నీ దగ్గరుండి నడిపించారు”అని తెలియజేశారు. డైరెక్టర్ సుధీర్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం లయ, ఆలీ, శివాజీ.. ఇలా బిగ్ స్టార్స్ అందరితో కలిసి పనిచేయడం నిజంగా నా అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అలీ, ఈటీవీ విన్ సాయి కృష్ణ, మిథిల్, బాలు, ధన రాజ్ పాల్గొన్నారు.